శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఎందుకు 100 తప్పుల వరకు మన్నించాడు ?

-

ఎవరు తప్పుచేసినా శిశిపాలుడు.. అంటూ ఉంటుంటారు. వీడికి వంద తప్పులు అయితే చాలు వీడి జీవితం పూర్తి అని అంటుంటారు. అసలు శిశుపాలుడు ఎవరు, ఇతనికి శ్రీకృష్ణుడితో సంబంధం ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం…

శిశుపాలుడు దమఘోషుడు, సాత్వతికి జన్మించాడు. వీరు శ్రీకృష్ణుడికి అత్తమామలు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో శిశుపాలుడు పుట్టాడు. తల్లితండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు ” అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి ” కృష్ణా నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు ” అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తికాగానే నా చేతిలో చనిపోతాడు ” అని చెప్పాడు.

అ తర్వాతి కాలంలో శిశుపాలుడు అనేక తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉంటాడు. ఒకసారి ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా చేధి దేశానికి వచ్చిన భీముడిని శిశుపాలుడు ఆదరించాడు. యాగానికి కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వనం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు. శత్రుత్వంతో ఉన్న శిశు పాలుడు గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు శ్రీకృష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో కృష్ణుడు సభనుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి అపరాధాలను మన్నించాను… నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఇప్పుడే సంహరిస్తానని చక్రం వేసి శిశుపాలుని శిరస్సు ఖండించాడు.

అసలు శిశుపాలుడు అనేవాడు.. కృత యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభ కర్ణులుగా, ద్వాపర యుగంలోశిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన వీళ్లంతా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయవిజయలు అని పురాణగాధలు స్పష్టం చేస్తున్నాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news