తిరుమలలో ఈ స్వామిని దర్శిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి!

-

తిరుమల అంటే తెలియనివారు ఉండరు. అక్కడ కలియుగ ప్రతక్ష దైవం వేంకటేశ్వరుడు అర్చితామూర్తిగా మనకు దర్శనమిస్తారు. అటువంటి క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే తిరుమల వేంకటేశ్వర గర్భాలయానికి సమీపంలో ఉన్న ఒక మూర్తిని దర్శిస్తే తప్పక భోగభాగ్యాలు, యోగం లభిస్తుందని ప్రతీక. ఆ వివరాలు తెలుసుకుందాం… వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గర్భగుడికి సమీపంలో స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది.

Sri Yoga Narasimhaswami Temple in Tirupati

ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటిక కాంతిగల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు. ఈ స్వామివారి దేవాలయం బయట చిన్న అరుగు ఉంటుంది. దానిపై మనం కోరుకున్న కోరికలను చేతితో రాస్తే తప్పక ఫలిస్తాయని భక్తుల నమ్మకం.

ఎవరు ఈ స్వామిని ప్రతిష్టించారు?

అయితే ఈ క్షేత్రంలో యోగా నారసింహస్వామిని ఎవరు ప్రతిష్టించారు అంటే … శ్రీమద్రామానుజులవారు ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు. ఇక స్వామికి ఇక్కడ నిత్యకైంకర్యాలేవీ జరుగవు. కానీ ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహిస్తారు. అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశిన నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధపారాయణలు ఇక్కడ స్వామి దగ్గర చేస్తారు.ఈ స్వామికి ఉత్సవ విగ్రహం లేదు. కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగ నరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news