దేశవ్యాప్తంగా ఉన్న శివ జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగంగా పిలవబడే ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ జ్యోతిర్లింగాలు అన్నింటిలోనూ శివుడు స్వయంభుగా ఉద్భవించినట్లు శివపురాణం లో తెలిపారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో చిట్టచివరి క్షేత్రం 12వ క్షేత్రం ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఒక అన్ని జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకత ఉంది అదే సంతానం లేని జంటలకు ఇక్కడ శివుడి ఆశీర్వాదం లభిస్తే సంతానం కలుగుతుంది. ఈ జ్యోతిర్లింగానికి ఘృష్ణేశ్వర ఆలయంగా పేరు రావడానికి ఓ భక్తురాలు కారణమవుతుంది.ఈ జ్యోతిర్లింగం గురించి పూర్తి వివరాలు చూద్దాం..
ఈ ఘృష్ణేశ్వరజ్యోతిర్లింగం ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులకు సంతానం లేని వారు, ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందని, శివుడు సంతానం లేని దంపతులకు సంతానాన్ని అనుగ్రహిస్తాడని నమ్మకం. ఎప్పుడు ఈ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. దూరప్రాంతాల నుంచి ప్రజలు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. మహా శివునికి సంబంధించి అనేక కథలు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్నాయి అంటారు. వాటిలో ఒకటి తన భక్తురాలి కొడుక్కి తిరిగి ప్రాణం పోయడంతో, ఈ క్షేత్రానికి సంతానం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయం పురాణ కథ ఒకటి ప్రసిద్ధి చెందింది. సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి దేవగిరి అనే పర్వతంపై నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం లేరు. సుదేహ తనకు సంతానం కలగడం లేదని తన చెల్లెలు షుష్మ తో తన భర్తకు రెండో పెళ్లి చేస్తుంది. ఈమె శివునికి అపార భక్తురాలు ప్రతిరోజు ఈమె 101 మట్టి లింగాలను స్వయంగా తయారు చేసుకొని పూజించేది. పూజ అయిన తర్వాత శివలింగాలను దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేసేది. కొన్ని రోజులకు షుష్మ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అయితే సుదేహ తనకు పిల్లలు లేకుండా తన చెల్లెలికి పిల్లలు పుట్టడంతో అసూయ తో ఆ బిడ్డను చెరువులో పడేస్తుంది. ఆ బిడ్డ చనిపోయిన వార్త షుష్మ కు తెలుస్తుంది అయినా ఆమె శివుడిని ఆరాధించేది.
రోజు లాగానే ఆమె 101 మట్టి లింగాలను పూజించి నిమజ్జనం చేయడానికి చెరువు వద్దకు వెళ్ళింది. అప్పుడే శివుడి ప్రత్యక్షమై ఆమె బిడ్డను చెరువులో నుంచి బతికించి ఆమెకి ఇస్తాడు. వెంటనే కోపంతో మహాశివుడు షుష్మ అక్క సుదేహను సంహరించాలనుకుంటాడు కానీ షుష్మ తన అక్కను క్షమించమని కోరుతుంది. మహాశివుడు షుష్మ కు ఏం వరం కావాలని అడుగుతాడు. షుష్మ మహాదేవుని నువ్వు ఇక్కడే నివసించాలి అని కోరుతుంది. ఇక అప్పటినుంచి ఈ జ్యోతిర్లింగం షుష్మ పేరుతో ఘుష్మేశ్వర మహాదేవ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూజించే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఇప్పటికే షుష్మ శివ లింగాల నిమజ్జనం చేసిన సరస్సు ఇక్కడే ఆలయంలో మనం చూడొచ్చు.
ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌలతాబాద్ లో బర్తల్ గ్రామంలో ఉంది. ప్రజలు ఈ ఆలయాన్ని ఘృష్ణేశ్వర మహాదేవ పేరుతోను పిలుస్తారు.
గమనిక: (ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.)