తిరుమలలో పదివేల విరాళం ఇస్తే మీకూ వీఐపీ దర్శనం!

తిరుమల.. దివ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం. శ్రీవారి దర్శనం కోసం ఎన్నెన్నో తిప్పలు పడుతారు భక్తులు. క్యూలైన్లో నిలబడే ఓపికలు లేనివారు వీఐపీ దర్శనం కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. పైసలు పోయినా సరే శ్రీఘ్రంగా దర్శనం కావాలనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక తీసుకున్న నిర్ణయాలలో మంత్రులు, వీఐపీలు ఇచ్చే లెటర్లను రద్దు.

అయితే వాటిస్థానంలో శ్రీవారి భక్తులకు టీటీడీ బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.10వేలకు శ్రీవారి వీఐబీ దర్శనం కల్పించేందుకు తిరుమలలో కొత్త స్కీమ్‌ ప్రారంభించింది. ఈమేరకు టీటీడీ అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి వివరాలు తెలియజేశారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళమిస్తే.. శ్రీవారి బ్రేక్‌ దర్శనం కేటాయించే స్కీమ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. నవంబర్‌ 1 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనం కావాలంటే.. భక్తులు ఎవరైనా రూ.10వేలు విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది.. వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్‌ అందిస్తారు. అయితే వీఐపీ బ్రేక్‌ దర్శనానికి సంబంధించిన రూ.500 కూడా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌ ( శ్రీవాణి ట్రస్ట్‌) పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి ఈ సేవల్ని అందిచనున్నారు.

నవంబర్‌ మొదటి వారంలో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి 15 రోజులు పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌ విధానంలో టిక్కెట్లను అందించనున్నారు.ఇప్పటికే లక్షకు పైగా విరాళం ఇచ్చే వారికి కొన్ని ప్రత్యేక దర్శనం, వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీన్ని మరింత మంది మధ్యతరగతి వారికి కూడా చేరువ చేసేందుకు పదివేల రూపాయల విరాళ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చారు.

శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వచ్చిన విరాళాలను ఆలయాల పరిక్షరక్షణ, నిర్మాణాలకు వినియోగించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తామని.. ఇలా చేయడం ద్వారా మత మార్పిడిలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందంటున్నారు టీటీడీ అధికారులు. అంతేకాదు హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయొచ్చని చెబుతున్నారు.
– కేశవ