తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. కోయిల్ అంటే గుడి ఆళ్వార్ అంటే భక్తుడు తిరుమంజనం అంటే శుద్ధి చేయడం లేదా పవిత్ర స్నానం చేయించడం అని అర్థం. అంటే, ఈ కార్యక్రమం ద్వారా ఆలయాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి పవిత్రంగా ఉంచుతారు. సాధారణంగా పెద్ద పండుగలు లేదా ముఖ్యమైన పర్వదినాలకు ముందు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ సంవత్సరము సెప్టెంబర్ 16 న ఉదయం 6 గంటలకు తిరుమలలో ఈ కార్యక్రము
జరుగుతుంది. ఇది భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఆలయాన్ని సిద్ధం చేస్తుంది.
ఆలయంలో నిత్యం జరిగే పూజలు, ఉత్సవాలు వేలాది మంది భక్తుల రాకపోకల వల్ల ఆలయ గోడలు పైకప్పు, పూజాసామగ్రిపై దుమ్ము ధూళి పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన అపరిశుభ్రతను తొలగించి ఆలయాన్ని పూర్తిగా పరిశుభ్రం చేయడానికి ఈ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం శ్రీవారి గర్భాలయం నుండి బంగారు వాకిలి వరకు, ఉప ఆలయాలు, పూజాసామగ్రి, గోడలు, పైకప్పు ఇలా ఆలయంలోని ప్రతి మూలనూ శుభ్రపరుస్తారు. ఇది ఆలయ పవిత్రతను కాపాడటానికి, దేవతామూర్తులను శుద్ధి చేయడానికి జరుగుతుంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రత్యేకతలు: ఈ కార్యక్రమాన్ని సంవత్సరంలో నాలుగు ముఖ్యమైన పర్వదినాల ముందు నిర్వహిస్తారు. ఉగాది,ఆణివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవాలు,వైకుంఠ ఏకాదశి నాడు నిర్వహిస్తారు.

పవిత్ర పరిమళ ద్రవ్యాలు: శుద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆలయంలోని ప్రతి గోడ, పైకప్పు ఉపాలయాలు, ఇతర ప్రాంతాలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఈ ద్రవ్యాలలో నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటివి ఉంటాయి.
మూలవిరాట్టుకు రక్షణ: తిరుమంజనం సమయంలో శ్రీవారి మూలవిరాట్టుకు దుమ్ము, ధూళి పడకుండా ఒక ప్రత్యేక వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని తొలగించి స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ: సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేయడం ద్వారా భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన వాతావరణంలో శ్రీవారి దర్శనం లభిస్తుంది. సెప్టెంబర్ 23 న సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ముఖ్యంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సిద్ధం చేస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల ఆలయానికి అత్యంత ముఖ్యమైన ఉత్సవం. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో శ్రీవారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల ముందు ఆలయాన్ని శుభ్రపరచడం ద్వారా శ్రీవారికి, భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం కలుగుతుంది.