వినాయకచవితి అంటే అది ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ. అందులో పత్రి, ఫలాలు, పూల పేరిట ఎక్కువగా ప్రకృతి ఆరాధనే ఉంటుంది. పర్యావరణం పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగానూ మనం మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలనే పూజించాలి.
ప్రతి ఏటా వినాయకచవితికి మట్టి విగ్రహాలను పూజించాలని ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా.. ఇప్పటికీ అనేక చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో పర్యావరణ కాలుష్యం ఏటా విపరీతంగా పెరుగుతోంది. దాంతో అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. అయితే పర్యావరణం పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగానూ మనం మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలనే పూజించాలి. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
సకల ప్రాణాలు మట్టిలోంచే వచ్చాయని, చనిపోయాక ప్రతి జీవి మట్టిలో కలవాల్సిందేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక పార్వతి వినాయకుడిని మట్టితోనే తయారు చేసి ప్రాణం పోస్తుంది. అందువల్ల మనం వినాయకుడ్ని పూజిస్తే సాక్షాత్తూ ప్రకృతిని పూజించినట్లే అవుతుంది. కనుక మనం మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను పూజిస్తేనే మనకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే విష పదార్థం.. దాంతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం వల్ల మనకు ఎలాంటి ఫలితం దక్కదు. కనుక మట్టి విగ్రహాలనే పూజించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఇక వినాయకచవితి అంటే అది ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ. అందులో పత్రి, ఫలాలు, పూల పేరిట ఎక్కువగా ప్రకృతి ఆరాధనే ఉంటుంది. అలాంటి వాటి మధ్యలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తేనే మంచిది. కానీ విష పదార్థాలతో, కృత్రిమ రంగులతో తయారు చేయబడిన విగ్రహాలను పెట్టి పూజలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రకృతి ఆరాధనలో ఈ తప్పు ఎవరూ చేయకూడదు. అందువల్ల ఈ వినాయకచవితికి అందరూ మట్టి విగ్రహాలనే పూజించండి. వినాయకుడి కృపకు పాత్రులు కండి..!