కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి. ఈ రోజు ప్రాతఃకాలమందే ఉసిరితో స్నానం చేసి దీపారాధన, దేవపూజ చేసుకోవాలి. 8-80 ఏండ్ల లోపు వారు నక్తం, ఉపవాసం (ఒక్కపొద్దు) ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, కాయకష్టం చేసేవారు కేవలం స్నానం, దీపారాధన చేసుకుంటే చాలు. వీరు ఉపవాసాలు ఉండనవసరం లేదని శాస్త్ర వచనం. ఇక ఉపవాసం ఉన్నవారు కేవలం ఆహారం భుజించకుండా ఉండటమే కాదు దేవునికి సమీపంగా ఉండాలి. అంటే మనస్సును ఆ పరమేశ్వరుడివైపు తిప్పాలి. ఆయన నామాలను స్మరిస్తూ, సత్యమే మాట్లాడుతూ, శుచి, శుభ్రతతో ఉండాలి. అంతేకాదు దానం,ధర్మం చేయడం విశేష ఫలితం వస్తుంది. ఇక అవకాశం ఉన్నవారు తప్పక సమీప దేవాలయాలను సందర్శించి అక్కడ కొంతసేపు ఉండి ధ్యానం చేసుకోవాలి. దీపారాధన చేయాలి.
ఏ దేవాలయాను సందర్శించాలి: శివాలయం, విష్ణు ఆలయం,దేవీ, గణపతి ఇలా ఏ దేవాలయమైన సందర్శించవచ్చు. కానీ త్రికరణ శుద్ధితో హరిహరనామస్మరణతో కాలం గడపాలి. చేసేపనిలో పరమాత్మను చూడాలి. ఇది కేవలం పౌర్ణమి నాడే కాకుండా నిత్యం అలవాటు చేసుకుంటే మోక్షం మీసొంతం.
ఏ దీపాలు పెట్టాలి: ఉసిరి దీపం, 365 వత్తుల దీపాలు, ఏదీ అవకాశం లేకుంటే భక్తితో దీపారాధన చేసినచాలు. దీపారాధనకు ఆవునెయ్యి అది లేనిచో నువ్వుల నూనె, ఇప్పనూనె, కుసుమనూనె వంటి సంప్రదాయ నూనె/నెయ్యిలను వాడితే మంచిది. అవకాశం ఉన్నవారు నదులు, సరస్సుల్లో అరటి డొప్పల్లో కార్తీక దీపాలను వదిలితే మంచిది.
జ్వాలాతోరణం: సమీప దేవాలయాల్లో జ్వాలాతోరణోత్సవం జరుగితే తప్పక ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమం చాలా పవిత్రమైనది. పార్వతీ పరమేశ్వరులను జ్వాలాతోరణం కింద నుంచి తీసుకుపోయే ఘట్టంలో తప్పక పాల్గొనాలి. దీనివల్ల యమలోకంలో మనకు చాలా బాధలు పోతాయని ప్రతీతి. యమలోక దర్శన అవసరం లేకుండా చేసే పవిత్ర ఉత్సవం జ్వాలాతోరణం. కాబట్టి అందరూ దీనిలో పాల్గొనాలి. పరమేశ్వరుడి కృపకు పాత్రలు కావాలి. హరహర శంభో శంకర. హరిహరి శంకర శంకర.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ