దేవుడి గదిలో లేదా ఇంట్లో సువాసన కోసం అగరుబత్తీలు (Incense Sticks) వెలిగించడం మన సంప్రదాయంలో ఒక భాగం. ఆ పరిమళం మనసుకు శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. అయితే అగరుబత్తి నుంచి వచ్చే ఆ చిన్న పొగ రేణువులు మీ ఊపిరితిత్తులకు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? అగరుబత్తి పొగలో నిజంగా ఏముంటుంది? దీనిని ఇంట్లో తరచుగా వాడటం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి రిస్క్‌లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అగరుబత్తి పొగలో సువాసన కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాకుండా, అనేక హానికరమైన పదార్థాలు దాగి ఉంటాయి. అగరుబత్తి తయారీలో ఉపయోగించే బొగ్గు, కలప పొడి మరియు జిగురు పూర్తిగా మండవు. దీనివల్ల పొగలో పార్టిక్యులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి.

ముఖ్యంగా అగరుబత్తి పొగలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది సిగరెట్ పొగలో ఉండే రేణువులంత చిన్నగా ఉంటుంది. ఈ అతి సూక్ష్మ రేణువులు మనం శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల లోపలికి, రక్తప్రవాహంలోకి చేరుకోగలవు.
అగరుబత్తి పొగను తరచుగా పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనిని ఇంట్లో, తగినంత గాలి ప్రసరణ లేని ప్రదేశంలో వాడినప్పుడు రిస్క్ ఇంకా పెరుగుతుంది. పొగలో ఉండే హానికర రసాయనాలు ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు లేదా కొత్త సమస్యలకు దారితీయవచ్చు.
అంతేకాకుండా కొన్ని అధ్యయనాలు అగరుబత్తి పొగను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరగవచ్చని సూచిస్తున్నాయి. ఇంట్లో అగరుబత్తి వాడటం తప్పనిసరి అయితే గదిలో కిటికీలు తెరిచి, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ద్వారా కొంతవరకు హానిని తగ్గించుకోవచ్చు.
అగరుబత్తి పొగ గురించి చేసిన పరిశోధనలు దీనిని ఇండోర్ గాలి కాలుష్యానికి ఒక ముఖ్య కారణంగా పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు దీని పొగకు దూరంగా ఉండటం మంచిది.
