ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన ఎందుకు చేస్తారు ?

-

ఆంజనేయస్వామి అంటే ఇష్టపడని వారు ఉండరు. పూజించనివారు ఉండరు. చివరకు విదేశీయులు కూడా హనుమాన్‌ ఆరాధన చేస్తున్నారు అంటే ఆయన గొప్పతనం అది. చిరంజీవులలో ఆయన ఒకరు. సాక్షాత్తు రుద్రస్వరూపం.  ఆంజనేయస్వామి దేవాలయాలు లేని గ్రామాలు దాదాపు ఉండకపోవచ్చు. అయితే ఈ స్వామిని తమలపాకులు, వడమాల, సింధూరంతో అర్చిస్తారు. వీటిలో తమలపాకుల మాలతో అర్చన ఎందుకు అనే విశేషాలు తెలుసుకుందాం… సీతమ్మ తల్లిని రావణుడు అపహరించిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలోనే రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న హ‌నుమంతుడు అశోకవనం చేరుకున్నాడు.

 

అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలదేరుతాడు. అయితే అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుడిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. కానీ, అక్కడ చుట్టుపక్కలా ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొర‌క‌క‌పోవ‌డంతో..  పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది.  అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనది. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ.. ఆకాశంలో పయనిస్తూ, గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు..

ఆంజనేయుడు క‌చ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకుంటారు. దీంతో వానరులంతా హ‌నుమంతుడు  రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇక అప్పట్నుంచీ అంజని పుత్రుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైపోయాయి. అందుకే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది తనను ఎవరైతే తమలపాకులతో అర్చిస్తారో వారి బాధలు తీరుస్తానని అన్నట్లు పెద్దలు చెప్తారు. ఏదీ ఏమైతేనేమి తమలపాకులు ఔషధగుణాలు కలిగి ఉన్నవి. వీటిని తరుచుగా తీసుకుంటూ ఉంటే రోగనిరోధకశక్తి, క్యాల్షియం శరీరానికి అందుతుంది. వీటిని ఆయా పదార్థాలతో సేవిస్తే దగ్గు, జ్వరం, కఫ బాధలు పోతాయి. ఇలా ఆంజనేయస్వామి ఆరాధనలో ఆరోగ్య విశేషాలు ఉన్నాయి. జై హనుమాన్‌.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version