బ్రహ్మ, విష్ణువులు లింగస్వరూపమైన మహాదేవుడిని అర్చించిన రోజే మహాశివరాత్రి. అయితే ఈ రోజున ఎవరైతే నాలుగు యామాలు (నాలుగు జాములు అని లోకంలో పిలుస్తారు) పూజ చేస్తారోవారికి సర్వం లభిస్తుందని పురాణ వచనం. అసలు నాలుగు యామాలు ఏంటి.. ఏ సమయంలో వసాయి. ఆ సమయంలో ఎలా పూజచేయాలో చూద్దాం…
మొదటి యామంః
సోమవారం సాయంత్రం 6.11 నిమిషాల నుంచి రాత్రి 9.15 ని॥ వరకు.
ఈ సమయంలో శివున్ని రుగ్వేద మంత్రాలతో ఓం నమఃశివాయనామంతో ఆవుపాలతో అభిషేకిస్తూ పూజించి పులగం నైవేద్యంగా సమర్పించాలి.
రెండో యామంః
సోమవారం రాత్రి 9.15 ని॥ నుంచి రాత్రి 12.18 ని॥ వరకు
ఈ సమయంలో స్వామిని యజుర్వేద మంత్రాలతో ఓం శంకరాయనమః అనే నామంతో ఆవు పెరుగుతో స్వామిని అభిషేకించిన తర్వాత పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
మూడో యామంః
సోమవారం రాత్రి 12.18 ని॥ నుంచి 3.22 ని॥ వరకు.
ఈ సమయంలో స్వామిని ఆవునెయ్యితో సామవేద మంత్రాలతో ఓం మహేశ్వరాయనమః అనే నామంతో అర్చించాలి. నువ్వులతో చేసిన పదార్థాలను స్వామికి నివేదించాలి.
నాల్గో యామంః
సోమవారం (రాత్రి తెల్లవారితే మంగళవారం) రా.తే. 3.22 ని॥ నుంచి మంగళవారం ఉదయం 6.26 నిమిషాల వరకు.
ఈ సమయంలో స్వామిని తేనెతో అభిషేకించాలి. అథర్వణవేద మంత్రాలతో నీలికలువలతో పూజించాలి. ఓం రుద్రాయనమః అనే నామంతో జపించాలి.
అన్ననైవేద్యాన్ని సమర్పించాలి.
ఈ నాలుగు యామాల్లో పరమ పవిత్రంగా అత్యంత భక్తితో ఏకాగ్రమైన మనస్సుతో స్వామిని అరాధిస్తే చాలు తప్పక స్వామి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
ఈ నాలుగు యామాల పూజలను శంకరమఠం, పెద్ద పెద్ద క్షేత్రాలలో ఈ విధంగా ఆచరిస్తారు. అవకాశం ఉన్నవారు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనండి.
పై పూజలు ఆచరించడానికి అవకాశం లేనివారు ఏం చేయాలి?
లింగోద్భవకాలంలో స్వామిని భక్తితో అర్చిస్తే చాలు
లింగోద్భవ కాలం మీకు తెలుసా?
సోమవారం శివరాత్రి రోజు లింగోద్భవకాలం వస్తుంది. లింగోద్భవకాలం అంటే శివమహాదేవుడు జ్యోతిస్ఫాటిక లింగంగా ఆవిర్భవించిన సమయం. ఈ సమయం చాలా పవిత్రమైంది. ఈసారి శివరాత్రినాడు ఆ సమయంలో పూజచేసుకుంటే విశేష ఫలితం వస్తుంది.
లింగోద్భవ సమయంః రాత్రి 11.54 నిమిషాల నుంచి 12.43 నిమిషాల వరకు. ఈ సమయంలో విబూది, రుదాక్షమాల లేదా రుద్రాక్ష ధరించి స్వామిని ఓం నమఃశివాయ పంచాక్షరితో స్వామిని మారేడుదళాలతో పూజించాలి. ధ్యానించాలి, కీర్తించాలి. అభిషేకించాలి.
శివపూజకు ప్రధానమైనవి మీకు తెలుసా?
శివుడు అభిషేక ప్రియుడు. ఆయన భోళా శంకరుడు. కుబేరుడు నుంచి కటిక దరిద్రుడు వరకు ఎవరైనా అర్చించగలిగే పదార్థాలే ఆయనకు ఇష్టం. అవి పరిశీలిద్దాం..
భస్మం, రుద్రాక్షలు, తుమ్మిపూలు, ఉమ్మెత్తపూలు, తెల్ల లేదా ఎర్ర గన్నేరు, గంధం, పంచామఋతాలు, మారేడు దళాలు ఇవి శివునకు ప్రీతిపాత్రమైనవి. అందరికీ దొరికేవి. వీటిని భక్తితో ఒక్కటి సమర్పించినా చాలు అని లింగాష్టకంలో పేర్కన్నారు.
ఏక బిల్వం శివార్పణం శివేన సహమోదతే.
– కేశవ