సినిమాలో నిజంగానే కథ డిమాండ్ చేస్తే అడల్ట్ సన్నివేశాలు పెట్టొచ్చు. కానీ కొందరు దర్శకులకు శృంగారంలో కళాత్మక ధోరణి, అశ్లీల ధోరణికి తేడా తెలియడం లేదు.
సాధారణంగా సినిమా అంటే.. ఒక సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే మాధ్యమం అయి ఉండాలి. కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు కాలక్షేపం కోసం చూసేదిగా ఉండాలి. అయితే ఈ ఫార్ములాకు తెలుగు సినీ దర్శక నిర్మాతలు ఎప్పుడో మంగళం పాడేశారని చెప్పవచ్చు. ఎందుకంటే.. నేటి తరుణంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్న ఏ ఒక్క సినిమా కూడా కుటుంబ సభ్యులతో కలసి చూడలేనంత బూతు ఎక్కువైంది. అగ్ర హీరోల సినిమాల మాట అటుంచితే.. చిన్నా, చితకా నటుల సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఘాటు కాసింత ఎక్కువైందనే చెప్పవచ్చు.
అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. కాలేజీల్లో చదువుకునే యువతీ యువకుల సహజమైన ప్రవర్తన, వారి మధ్య ఉండే ప్రేమ, రొమాన్స్, బ్రేకప్.. తదితర అంశాల మేళవింపుతో అర్జున్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత ఈ సినిమాను బాగా ఆదరించారు. దీంతో అర్జున్ రెడ్డి ఫార్ములాను తలకెక్కించుకున్న చిత్ర దర్శకులు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. ఆ కోవలో మొదటగా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100.
ఆర్ఎక్స్100 సినిమా కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో అర్జున్ రెడ్డిని మించిన అడల్ట్ కంటెంట్ ఉంది. ఈ క్రమంలోనే ఆర్ఎక్స్100 బంపర్ హిట్ అయింది. దీంతో మరికొందరు దర్శకులు అదే బాటలో పలు సినిమాలను తెరకెక్కించారు. వాటిల్లో ఇటీవలే వచ్చిన.. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ఒకటి. ఇంకా ఏడు చేపల కథ, డిగ్రీ కాలేజ్, నేను లాంటి చిత్రాలు కూడా త్వరలో రానున్నాయి. ఇవన్నీ ఒకటే ఫార్ములాతో తీయబడినవి.. అదే బూతు కంటెంట్ ఫార్ములా..!
బూతు కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమా దర్శకులను ఈ విషయంపై ప్రశ్నిస్తే.. సినిమా కథ డిమాండ్‌ను బట్టి హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, మధ్య మధ్యలో యాక్టర్లచే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు చెప్పించడం, అలాగే అడల్ట్ సీన్లను చూపించడం చేస్తున్నామని ఆ దర్శకులు చెబుతున్నారు. ఇక కొందరైతే.. తమవి చిన్న సినిమాలని.. వాటిల్లో బూతు డోసు ఆ మాత్రం ఉండకపోతే.. తమ సినిమాలను ఎవరు చూస్తారని.. అందుకే అడల్ట్ కంటెంట్‌ను సినిమాల్లో చొప్పిస్తున్నామని చెబుతున్నారు.
అయితే సినిమాలో నిజంగానే కథ డిమాండ్ చేస్తే అడల్ట్ సన్నివేశాలు పెట్టొచ్చు. కానీ కొందరు దర్శకులకు శృంగారంలో కళాత్మక ధోరణి, అశ్లీల ధోరణికి తేడా తెలియడం లేదు. దీంతో తాము ఓ వైపు కథ పేరు చెప్పి కళాత్మక ధోరణిలో శృంగార సీన్లను తీస్తున్నామని భ్రమిస్తున్నారు కానీ.. నిజానికి అవి తెరపై అశ్లీల ధోరణిలో బూతు సీన్లను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోవైపు సినిమా ప్రచార దృశ్యాల పేరు చెప్పి టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్‌లను ప్రదర్శిస్తూ.. అవే బూతు సీన్లను ముందుగా జనాలకి చూపిస్తూ ఆ తరువాత వారిని థియేటర్లకు వచ్చేట్లుగా చేస్తున్నారు. దీంతో ఆ చిత్రాలను సహజంగానే ఆ వర్గానికి చెందిన ప్రేక్షకులు, యూత్ ఆదరిస్తున్నారు.
ఒక వేళ సినిమాల్లో నిజంగానే అడల్ట్ కంటెంట్ ఉన్న దృశ్యాలను కళాత్మక ధోరణిలోనే దర్శకులు తీస్తే.. అప్పుడు వాటిని ట్రైలర్లు, టీజర్ల రూపంలో బూతు సీన్లలాగా ముందుగా ప్రేక్షకులకు చూపించాల్సిన అవసరం ఏమిటి ? అన్నది అసలు ప్రశ్న. అంటే.. చిత్ర దర్శక నిర్మాతలు కావాలనే ఆ సీన్లను ట్రైలర్లలో చూపిస్తున్నారన్నమాట. తమ సినిమాలో ఆ తరహా సీన్లు ఉంటాయని ట్రైలర్లలో చెబుతూ.. ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారన్నమాట. మరి ఇందులో కళాత్మక ధోరణి ఎక్కడుంది ? అంతా బూతు ధోరణే కదా ? ఇందుకు చిత్ర దర్శక నిర్మాతలు సమాధానం చెబుతారా ?
బూతు డోసు ఎక్కువ ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు తెరకెక్కించడం ఓ ఎత్తైతే.. మరొక వైపు ఆ సినిమాలలోని శృంగార భంగిమలకు చెందిన పోస్టర్లు, లిప్ లాక్ సీన్లు, శృంగార సీన్లతో టీజర్లు, ట్రైలర్లను రిలీజ్ చేస్తూ.. పోస్టర్లను గోడలపై అంటిస్తూ.. యువతలో తప్పుడు ఆలోచనలు కలిగే విధంగా క్యాప్షన్లు పెడుతూ.. వికృత చర్యలకు పాల్పడుతుండడం మరో ఎత్తు.. వెరసి సామాజిక బాధ్యతలను మంటలో కలిపి కొందరు దర్శక నిర్మాతలు బూతే పరమావధిగా సినిమాలను తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిజానికి ఇప్పుడు టాలీవుడ్‌లో ఇప్పటికే విడుదలైన కొన్ని, ఇకపై విడుదల కానున్న మరికొన్ని సినిమాలను తెలుగు సినీ సమాజంలోని చాలా వరకు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అంతటి అశ్లీలం ఈ సినిమాల్లో ఉంది. ఈ క్రమంలోనే సినిమా అంటే.. సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సాధనంగా కాక.. బూతు భావనను పెంపొందించే మాధ్యమంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక బూతు మాటలను, హింసాత్మకంగా ఉన్న సీన్లను నిర్దాక్షిణ్యంగా సెన్సార్ చేసే బోర్డు.. ఇలాంటి సినిమాలను విడుదల చేసేందుకు ఎలా అనుమతిస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. మరి ఇకనైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ బూతు జోరు తగ్గుతుందా ? ఇంకా పెరుగుతుందా ? అన్నది తెలియాలంటే.. అందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది..!