యూపీఏలో ఉన్న మిత్ర పక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా తట్టా బుట్టా సర్దుకుని ఎన్‌డీఏలో మరోసారి పొత్తు కోసం యత్నిస్తారనే సమాచారం అందుతోంది.
దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఆ పోల్స్ అన్నీ ఈసారి ఎన్‌డీఏదే అధికారం అని తేల్చేశాయి. ఈ క్రమంలో ఫలితాలకు కేవలం 2 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు మోడీ మళ్లీ ప్రధాని అవుతారా, కారా.. అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మరో కొత్త రాజకీయ సమీకరణానికి తెర తీస్తారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. నిజానికి అది కొత్త సమీకరణమేమీ కాదు, పాతదే.. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు నిజంగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే.. అప్పుడు చంద్రబాబు మరోసారి బీజేపీ పంచన చేరతారని తెలుస్తోంది.
నిజమే.. రాజకీయాలు అన్నాక శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. వారు వీరు అవుతారు.. వీరు వారు అవుతారు.. అలా పొత్తులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. విడిపోతుంటారు, మళ్లీ కలుస్తుంటారు. అయితే.. అందుకు చంద్రబాబు ఏమీ మినహాయింపు కాదు. ఆయన కూడా ఓ రాజకీయ నాయకుడే కదా. ఒక పార్టీ కాకపోతే మరొక పార్టీ అని ఎప్పుడూ పొత్తుల కోసం చూస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఈ సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో కలసి ముందుకు సాగుదామని చంద్రబాబు చూస్తున్నారట. అందుకు కారణం జగనే..? ఎలా అంటారా…
కేంద్రంలో బీజేపీకే వైసీపీ మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ఒక వేళ తాము ఏపీలో అధికారంలోకి రాకపోయినా సరే.. కేంద్రంలో బీజేపీతో వైసీపీ కలవకుండా చూడాలని, అందుకని వైసీపీ కన్నా ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని, దాంతో వైసీపీ.. బీజేపీ వైపు చూడదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అందుకనే ఆయన వైసీపీ కన్నా ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది.
గత రెండు సంవత్సరాల కిందటి వరకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో కొనసాగిన టీడీపీ అకస్మాత్తుగా ప్రత్యేక హోదా పేరు చెప్పి ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు మాట్లాడడం మొదలు పెట్టారు. ఎన్నికలు ముగిసే వరకు.. మొన్నీ మధ్య వరకు కూడా చంద్రబాబు మోడీని విమర్శించారు. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు మోడీని విమర్శించడం తగ్గింది. అలాగే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి అనుకూలంగా వచ్చినప్పటి నుంచి యూపీఏలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కాంగ్రెస్‌కు కొంత దూరమైనట్లు కనిపించింది. అటు డీఎంకే అధినేత స్టాలిన్, ఇటు బీఎస్‌పీ అధినేత్రి మాయావతిలు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 23వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.
ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చంద్రబాబు నిన్న సాయంత్రం సమావేశమైనప్పటికీ తమ భవిష్యత్ కార్యాచరణపై వారు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో యూపీఏలో ఉన్న మిత్ర పక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా తట్టా బుట్టా సర్దుకుని ఎన్‌డీఏలో మరోసారి పొత్తు కోసం యత్నిస్తారనే సమాచారం అందుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారై యూపీఏ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరది నిజమవుతుందా, లేదా అన్నది మరో 2 రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది..!