కరోనా రెండో వేవ్ ప్రభావం జూన్ 30 వరకు పూర్తిగా తగ్గుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో కోవిడ్ మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కోవిడ్ మూడో వేవ్ అక్టోబర్‌లో వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అనేక మంది నిపుణులు అభిప్రాయాలను వెలిబుచ్చారు. అయితే అప్పటి వరకు పెద్ద ఎత్తున కోవిడ్ టీకాలు వేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి అప్పటి వరకు టీకాలను వేస్తుందా ? అసలు కోవిడ్ టీకాలకు అప్పటి వరకు సప్లై ఎంత చేస్తారు ? ఎంత డిమాండ్ ఉంటుంది ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
అక్టోబర్ 2021 వరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గాను 335 మిలియన్ల డోసులను సరఫరా చేయనున్నారు. ఇక అదే సమయానికి కోవాగ్జిన్ 225 మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే స్పుత్‌నిక్ వి 36 మిలియన్ల డోసులు అందుబాటులో ఉంటాయి. దీంతో అప్పటి వరకు మొత్తం సప్లయి అయ్యే డోసుల సంఖ్య 621 మిలియన్లకు చేరుకుంటుంది.
ఇక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2021 వరకు దేశంలోని మొత్తం మందికి టీకాలను వేస్తామని చెప్పింది. అంటే 1 బిలియన్ సంఖ్యలో ఉన్న ప్రజలకు 2 బిలియన్ల డోసులను వేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అక్టోబర్ వరకు సుమారుగా 1.017 బిలియన్ల డోసులు అవసరం అవుతాయి. కానీ వాస్తవ గణాంకాలను చూస్తే 621 మిలియన్ల డోసులే అప్పటి వరకు సప్లయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మరో 400 మిలియన్ల డోసులకు కొరత ఉంటుంది. మరి ఆ ఖాళీని ఇతర వ్యాక్సిన్ల డోసులతో పూడుస్తారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే కేంద్రం చెప్పినట్లుగా టీకాలను వేయకపోతే మాత్రం కోవిడ్ మూడో వేవ్‌ను కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవిడ్‌ను అడ్డుకట్ట వేసేందుకు ఉన్న మార్గాల్లో టీకాలను వేయడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. కనుక వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మంచిది. లేదంటే మూడో వేవ్‌కు మరింత మంది బలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.