దీపావళి అల్లుళ్లు – తెలంగాణ మాజీమంత్రులు

-

మంత్రిపదవి లేకపోతే… ప్రజాసేవకు అవకాశమే లేదట పాపం, తెలంగాణ మాజీమంత్రులకి. మొత్తం అయిదేళ్లూ మంత్రిపదవి అనుభవించినా, ఇంకా వాళ్లకు తనివి తీరలేదు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఊహించినట్లుగానే కేటీఆర్‌, హరీశ్‌, పువ్వాడ, సబితలకు మంత్రిపదవులు దక్కగా, అనూహ్యంగా గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌లకు కూడా పదవులు రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

ఈ నేపథ్యంలో షరామామూలుగానే అసమ్మతి పెల్లుబికింది. అయితే విచిత్రంగా ఎమ్మెల్యేల నుండి మాత్రమే కాక, మాజీ మంత్రుల నుండి కూడా అసహనం వ్యక్తం అవుతోంది. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, విలేకరులతో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేయగా, మరో మాజీ, జోగు రామన్న అలిగి అడ్రస్‌ లేకుండా పోయాడట. ఆమధ్య బర్తరఫ్‌ కాబడ్డ తాటికొండ రాజయ్య కూడా సన్నాయినొక్కులు స్టార్ట్‌ చేసాడు. ఇక అసంతృప్త శాసనసభ్యుల జాబితా కొంచెం పెద్దగానే ఉంది. వినయభాస్కర్‌, జీవన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌… ఇలా..

అయితే, ఇందులో నాయిని పోయినసారి పూర్తిస్థాయి హోంమంత్రిగా అయిదేళ్లూ పనిచేసాడు. ప్రస్తుతం 80 ఏళ్ల దరిదాపులో ఉన్న ఈయన ప్రస్తుతం సరిగ్గా నడవలేడు. ఎవరైనా సహాయం చేయాల్సిందే. కానీ మంత్రిపదవి మాత్రం కావాలి. ఎటువంటి చైర్మన్‌గిరీ వద్దు. ఈయనా టిఆర్‌ఎస్‌ జెండాకు ఓనరే. తన అల్లుడికి కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఇదీ ఈయనగారి కంఠశోష. మరి ఇంకా చేయాల్సిన ప్రజాసేవ ఏం మిగిలుందో అయనకే తెలియాలి.

మరో మాజీమంత్రి జోగు రామన్న. ప్రస్తుతం రామన్నగారు అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు (వారి కుటుంబసభ్యుల సమాచారం మేరకు). ఈయన కూడా ఐదేళ్లూ మంత్రిగా పనిచేసినవారే. అది కూడా అటవీశాఖకు. దేవుడి (?) దయవల్ల ఆదిలాబాద్‌లో ఉన్న సగం అడవుల్ని వీరి అబ్బాయి సహృదయంతో ఖాళీ చేసాడని వినికిడి. ఈసారి నాన్నగారికి పదవి ఇస్తే, ఎవరి రుణం ఉంచుకోకుండా పూర్తిగా అడవుల్ని మాయం చేస్తానని హామీ ఇస్తున్నాడట. ఇంకో విషయమేమిటంటే, రామన్న కనబడకుండా పోవడానికి తండ్రీకొడుకుల మధ్య ఒక వ్యక్తిగత విషయమై జరిగిన గొడవే కారణమని వారి ఆంతరంగికుల మాట. ఇక డా.రాజయ్య ఎస్సీ కోటాలో తనకు మళ్లీ మంత్రిపదవి ఇవ్వాల్సింది కదా. ఈసారి ఎటువంటి గొడవల్లేకుండా మహిళా సిబ్బందితో పద్ధతిగా రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తానని గట్టిగా చెబుతూ, అధిష్టానం ఏ పదవిచ్చినా చేస్తానని నొక్కి వక్కాణిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలల్లో మైనంపల్లి మాయం కాగా, జీవన్‌రెడ్డి పనిలేక పరీక్షలు రాస్తున్నాడట. పదవిస్తే పనిచేస్తాను లేకపోతే ఫారిన్‌ పోతానని వీరి స్టేట్‌మెంట్‌. రసమయికి పాపం… కళాపోషణకు కూడా వీలులేకుండా ఉన్న సారథి కాస్తా పీకేసారు. తనకు కాకుండా ఎవరికి మంత్రిపదవిచ్చినా, అది ఘోర తప్పిదమేననే స్ట్రాంగ్‌ ఫీలింగ్‌తో ఉన్నాడు.

నిజానికి అన్యాయం అంటూ జరిగితే, అది దాస్యం వినయభాస్కర్‌కు, పద్మాదేవేందర్‌రెడ్డికి జరిగిందని జనాంతికం. టీఆరెస్‌ ఆవిర్భావం నుండీ చురుకుగా ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర వీరిది. వినయ్‌ని కాదని కమలాకర్‌కు, పద్మను కాదని సత్యవతికి / సబితకు మంత్రిపదవులు ఇవ్వడం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని విశ్వసనీయ సమాచారం. వినయభాస్కర్‌కు చీఫ్‌ విప్‌ కేటాయించడంతోనే అర్థం అయిపోయింది ఇక మంత్రిపదవి రాదని. అయితే వీరిద్దరూ నిజంగానే అన్యాయానికి గురయ్యారా లేక స్వయంకృతాపరాధమేమైనా ఉన్నదా అనేది వారికి, ముఖ్యమంత్రికే తెలియాలి.

 

సాధారణంగా మంత్రివర్గవిస్తరణ అనగానే, అసంతృప్తులు తలెత్తడం సహజం. అయితే ఈసారి లేచిన అసహనాలు కొంతమేరకు అధిష్టానం స్వయంకృతమనేది రాజకీయ విశ్లేషకుల మాట. సొంతంగా 88మంది బలం ఉండగా, ఇతర పార్టీవారిని చేర్చుకుని, వారికి పదవులు ఇవ్వడం మొదటినుంచీ పార్టీలో ఉన్నవారికి సహజంగానే మింగుడుపడదు. దాంతో అసంతృప్తిజ్వాలలు భగ్గుమన్నాయి. దానిలో భాగంగానే గంగుల కమలాకర్‌ టిడిపిలో ఉన్నప్పుడు కేటీఆర్‌ ఆయనను విమర్శించిన విడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో గిరగిరా తిరుగుతోంది. గంగుల, సబిత, సత్యవతి… ఈ ముగ్గురూ వేరే పార్టీ నుంచి వచ్చినవారే. వీరిని ఉద్దేశించే నాయిని, కిరాయిదార్లని అన్నాడు.

ఏదేమైనా, అధినేతకు కొన్ని ఆలోచనలు, సమీకరణాలు, సమతూకాలు ఉంటాయి. కొన్నికొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సిఉంటుంది. ఇవన్నీ కేసీఆర్‌ అతులిత రాజకీయ చతురతకు తెలియనివికావు. కాకపోతే, బిజేపీ దూకుడుకు కళ్లెం వేయడం కోసం ఈటల రాజేందర్‌ను కొనసాగింపకాతప్పలేదు, హరీశ్‌కు పదవి ఇవ్వకాతప్పలేదు. అన్నింటికీ సమయమే సమాధానం.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news