తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
తీవ్ర స్థాయిలో వెన్నాడుతున్న ఆర్థిక లోటు
ఓ రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్నాయి
ముఖ్యంగా ఆశించిన విధంగా ఆదాయం లేని
రాష్ట్రాలలో ముఖ్యంగా సంపద సృష్టి సరిగా లేని రాష్ట్రాలలో
ఆంధ్రావని ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో అప్పు పుట్టుక అన్నది అంత సులువు కాదు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయమై మళ్లీ మళ్లీ కేంద్రాన్ని విసిగిస్తోందా? గతంలో కూడా తెచ్చిన అప్పుల లెక్క తేలనే లేదు కానీ ఇదే విధంగా రాయబారాలు బేరసారాలు సాగించిందన్న వాదన ఒకటి వినిపించింది. అప్పుల కారణంగా ఆంధ్రావని కాస్త కూడా ప్రగతి సాధించగపోగా, కేంద్రం దగ్గర చులకనయిపోతోంది. దేశంలో ఆర్థిక పురోగతి లేని రాష్ట్రాల జాబితాలో ఎప్పుడో చేరిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ఇకపై అప్పులు చేయాలంటే చాలా అంటే చాలా ప్రయత్నాలు చేయాలి.
ఈ దశలో ముఖ్యమంత్రి దత్తపుత్రికలు అయిన సంక్షేమ పథకాలు ఏమయిపోతాయో మరి! ఈ నేపథ్యంలో వైసీపీ వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. సంక్షేమం అన్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అది జీవన ప్రమాణ మెరుగుదలకు ఉపయోగపడుతుందని అంటున్న నాయకులు, ఇకపై వాటిని ఏ విధంగా కొనసాగించాలన్నా సందిగ్ధమే ! కేవలం ఆర్థిక వ్యయ రీతి అత్యధికంగా ఉండి, ఆదాయం తక్కువగా ఉండే రాష్ట్రం కూడా మనదే !
ఈ విధంగా మాట్లాడితే రెండేళ్లు ఎటువంటి ఆదాయం ఆశించిన స్థాయిలో దక్కకపోయినా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత మాదే అని వైసీపీ అంటోంది. నిజమే కావొచ్చు. నగదు బదిలీ అన్నది ఓ విధంగా పేదలకే మేలు కావొచ్చు. కానీ ప్రయోజనం కన్నా అప్పుల భారం ఎక్కువ గా ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం తగదు అని అంటోంది ఆర్థిక నిపుణుల వర్గం. ముఖ్యంగా రానున్న కాలంలో మనకు అప్పులు పుట్టే ఛాన్స్ కూడా తక్కువే ! ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానా అన్నది ఖాళీ అయి చాలా రోజులయింది.కాస్తోకూస్తో పన్నుల వసూలు బాగున్నా క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. చెప్పాపెట్టకుండా పన్నులు పెంచి ఆదాయం తెచ్చుకోవాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి అంగీకారం పొందడం అంత సులువు కాదు.
జీఎస్టీ లాంటి వసూళ్లు బాగున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కే వాటా చాలా తక్కువ. మన దగ్గర నుంచి గుంజుకున్న పైసలను మళ్లీ తిరిగి ఇవ్వాలంటే కేంద్రానికి పెద్ద మనసు ఉండాలి. కానీ నిబంధనల పేరిట చాలా అంటే చాలా తక్కువ మోతాదులోనే మనకు నిధులు అందుతున్నాయి. ముఖ్యంగా జనాభా పేరిట మనకు కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పి. తాజాగా కేంద్రం నుంచి అప్పుల రూపంలో పొందిన అనుమతి 28వేల కోట్ల రూపాయలు. బహిరంగ మార్కెట్లో రుణ పరిమితి కింద ఈ మొత్తాన్ని కేంద్రం నిర్ణయించింది. కానీ కేంద్రాన్ని రాష్ట్రం అడిగిన మొత్తం 61వేల కోట్లు రుణ రూపేణా…