తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు, వ్యవసాయానికి సంక్రాంతి ప్రత్యేక పండుగ అని.. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగేలా చూడాలంటే ప్రకృతి మాతను ప్రార్థించారు. వ్యవసాయానికి, రైతన్న సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని.. దేశంలో మరే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తమలాగా పాటు పడలేదని అన్నారు. పదేల్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు.
తమ పాలనలో రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు ఖర్చు చేసామని చెప్పారు. నూతన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని.. పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంగా గడపాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడిందని చెప్పారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమం పథకాలను తీసుకొచ్చిందని.. వాటిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు.