ఎడిట్ నోట్ : వ‌న జీవి ధ‌న్య జీవి మ‌రో గొప్ప ప‌ని చేశాడ్రా !

క్ష‌మకు అర్థం చెప్పిన గొప్ప‌వాడు వ‌న‌జీవి.. మ‌రోసారి మాన‌వ‌త‌ను చాటాడు. ఈ దేశం నా తెలంగాణ అన్న‌వి ఆనందించేందుకు కార‌ణం అయ్యాడు. బాధ్య‌తను పెంచి మ‌రోసారి ఈ ఉద‌యం స్మ‌ర‌ణ‌కు తూగేడు. వ‌న‌జీవి అంటే నిష్క‌ల్మ‌ష జీవి అని అర్థం..ఆ అర్థానికి కొన‌సాగింపు ఆయ‌న నిర్ణ‌యం కానీ జీవితం కానీ ! అందుకే ఆయ‌న నేల‌ను కాపాడుతూ మ‌న‌ల్నీ కాపాడుతూ ఓ బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను నెత్తిన పెట్టుకుని న‌డుస్తున్నాడు. ఆస్ప‌త్రి గోడ‌ల మ‌ధ్య చికిత్స పొందుతూ కూడా ప్ర‌కృతికే ప్రాధాన్యం ఇస్తూ..త‌న‌కు తెలియ‌కుండా ఈ లోకానికి సందేశం ఇస్తున్నాడు. మ‌నం పాటిస్తున్నామా లేదా దేవుడు మ‌న‌వైపు ఉన్నాడా లేడా ..దైవ వాక్కు పాల‌న మ‌నం చేయ‌గ‌ల‌మా ? ఇవ‌న్నీ ఆలోచిస్తే మ‌న క‌న్నా ఆయ‌న వంద రెట్లు గొప్ప ! మ‌నం చిన్న‌వారం స‌ర్దుకుపోవాలంతే !

వ‌న జీవి, ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత రామ‌య్య ఓ గొప్ప ప‌ని చేశాడు. ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న తీవ్ర గాయాల పాలై ఆస్ప‌త్రి లో చేరిన విష‌యం విధిత‌మే ! తన‌ను ఢీ కొన్న ద్వి చ‌క్ర వాహ‌న‌దారుడిపై కేసు పెట్ట‌వ‌ద్ద‌ని పోలీసుల‌ను వేడుకున్నాడు. ఇందుకు ప్ర‌తిగా వంద మొక్క‌లు నాటి వాటి ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అత‌డి ఆ విధంగా పోలీసులు ఆదేశించాల‌ని వేడుకున్నాడు.

గొప్ప‌వాడు తీవ్ర గాయాలున్నా కూడా, త‌న కోసం కాదు ఈ నేల కోసం ఈ ప్ర‌కృతి కోసం ఏదో చేయాల‌న్న త‌ప‌న ద‌గ్గ‌ర మనం అంతా చిన్న‌వారం. ఖ‌మ్మం జిల్లా, రెడ్డిప‌ల్లి వ‌ద్ద మొక్కల‌కు నీళ్లు పోసేందుకు వెళ్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల‌న జ‌రిగిన గాయాల నుంచి ఆయ‌న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మంత్రి హ‌రీశ్ రావు సైతం స్పందించి, ఆయ‌ను మంచి వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించారు. అలానే ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని మునుప‌టి మాదిరిగానే ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌కు చర్య‌లు చేప‌ట్టాల‌ని ఆకాంక్షించారు.

వాస్త‌వానికి ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో మంచి ప‌నులు చేశారు. ఎన్నో వేల మొక్క‌ల‌కు ప్రాణం పోశారు. కొన్ని నీడ‌ల‌కు ఆయ‌నే కార‌ణం అయ్యారు. అడ‌వి లేక‌పోతే తాను లేడు. తాను లేకుండా అడ‌విని ఊహించ‌లేడు. మ‌న తెలుగు నేల‌ల్లో ఇంకొంద‌రు వ‌న‌జీవులు కావాలి. రావాలి కూడా ! మ‌న రాజ‌కీయాలు మ‌న తంత్రాలు అన్న‌వి అటుంచి మాట్లాడే మ‌నుషులు కావాలి. రావాలి కూడా ! వ‌న‌జీవిని ప్రేమించ‌డం, ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించ‌డం అన్న‌వి ప్ర‌భుత్వాలు విరివిగా చేయాలి. కొత్త మార్గాన ప‌ర్యావ‌రణ ప‌రిర‌క్షణ పూనిక వ‌హించాలి. కేవ‌లం ప‌ద్మ పురస్కారాలు అందించి చేతులు దులుపుకుంటే ఈ నేల ను ఎవరు ర‌క్షిస్తారు అన్న ప్ర‌శ్న ఎవ‌రికి వారు మ‌న పాల‌క వ‌ర్గం అదేవిధంగా జ‌నానీకం వేసుకోవాలి.

పుడ‌మికి కొత్త ఆనందాలు ఇచ్చే క్ష‌ణాల‌ను ఆహ్వానించాలి. అందుకు దోహ‌ద‌కారి శక్తులుగా నిల‌వాలి. వ‌న‌జీవి ధ‌న్య జీవి.. ఆయ‌న మార్గంలో మ‌రికొన్ని మేలిమి జాతి మొక్క‌లు ఎదుగుతాయి. మ‌నం వాటిని ర‌క్షించాలి. మ‌నం మ‌న ప‌నులు మానుకుని అయినా స‌రే కొన్ని మంచి ప‌నులు చేస్తే దేవుడు దీవిస్తాడు. నేల‌ను కాపాడితేనే దేవుడు దీవిస్తాడు. దేవాల‌య భూములు ప‌రిర‌క్షిస్తేనే దేవుడు దీవిస్తాడు. మంచి ఏ కొంచెం మీలో ఉన్నా కూడా దేవుడు దీవిస్తాడు. వ‌న‌జీవి రూపాన మీ త‌ప్పులను క్షమిస్తాడు.

– రత్న‌కిశోర్ శంభుమ‌హంతి