సీక్వెల్స్ లో హిట్టెంతా?

-

హిట్ సినిమాని రీమేక్ చేయ‌డం ఓ ట్రెండ్‌. ఇది ఆనాటి నుంచి ఉంది. హిట్ సినిమాకి సీక్వెల్ చేయ‌డం గ‌త కాలంగా వ‌స్తుంది. స‌క్సెస్‌ఫుల్ ఫార్ములాని రిపీట్ చేసి మ‌రోసారి స‌క్సెస్ కొట్టేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే రోబోకి సీక్వెల్‌గా 2.0, సింగం కి సీక్వెల్‌గావ‌చ్చిన సింగం2, సింగం3, రాజుగారి గ‌దికి సీక్వెల్‌గా రాజుగారి గ‌ది2, ఆర్య‌కి సీక్వెల్‌గా ఆర్య 2, శంక‌ర్ దాదా ఎం.బీ.బీ.ఎస్‌కి సీక్వెల్‌గా శంక‌ర్ దాదా జిందాబాద్‌, గ‌బ్బ‌ర్ సింగ్‌కి సీక్వెల్‌గా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ వంటి చిత్రాలు వ‌చ్చాయి. తాజాగా ‘కార్తికేయ‌’కి సీక్వెల్ రాబోతుంది. నిఖిల్‌, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో 2014లో ‘కార్తికేయ’ విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘కార్తికేయ 2’ రాబోతోంది. చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.

How much scope is there to get hits in sequel movies

నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. మ‌రి ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న సీక్వెల్‌పై ఓ లుక్కేస్తే. నాగార్జున‌, సొనాలి బింద్రే జంట‌గా న‌టించిన‌ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ఇప్పుడు ‘మ‌న్మ‌థుడు 2 రూపొందుతుంది. రాహుల్ ర‌వింద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఇందులో నాగార్జున స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తున్నారు. మ‌రోకీల‌క పాత్ర‌ల్లో స‌మంత‌, కీర్తి సురేష్ క‌నిపించ‌నున్నారు. శ‌ర‌వేగంగా ఇది చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. శంక‌ర్‌, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘భారతీయుడు’అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’రూపొందుతుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కమ‌ల్ హాస‌న్‌, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప‌లు కార‌ణాల‌తో ఆగిపోయిన ఈ సినిమా త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్‌ని జ‌రుపుకోనుంది. అడ‌వి శేష్ హీరోగా శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘గూఢచారి’ గ‌తేడాది ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ని ‘గూఢచారి2’ పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. కోలార్ గోల్డ్ మైనింగ్ నేప‌థ్యంలో య‌ష్‌హీరోగా క‌న్న‌డ‌లో వ‌చ్చిన ‘కేజీఎఫ్‌ చాప్టర్ 1’ అద్భుత‌మైన విజయాన్నిసాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ చాప్టర్ 2’ రూపొందుతుంది. ప్ర‌స్తుతం ఇవి చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా మ‌రికొన్ని సీక్వెల్ సెట్స్ పైకి వ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

అందులో నాగార్జున మ‌రో సీక్వెల్ చేయ‌బోతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయిన’కు కొనసాగింపుగా ‘బంగార్రాజు’ తెర‌కెక్క‌బోతుంది. దీనికి కూడా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో నాగచైతన్య కూడా న‌టించ‌నున్నార‌ట‌. అలాగే ‘రాజుగారి గది’ కి రెండో సీక్వెల్‌కి ద‌ర్శ‌కుడు ఓంకార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూడా నాగార్జున నటిం అవ‌కాశం ఉంది. వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ రూపొందించిన ‘యాత్ర’విశేష ఆద‌ర‌ణ‌, ప్ర‌శంశ‌లు పొందింది. దీనికి సీక్వెల్‌గా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ఓదార్పు యాత్ర‌, పాద‌యాత్ర‌ల‌ని మేళ‌వించి ‘యాత్ర2’ రూపొందించ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎఫ్‌ 2’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈసారి ఇందులో మ‌రో హీరో జాయిన్ కాబోతున్నాడ‌ని తెలుస్తుంది. ఆ చిత్రానికి ‘ఎఫ్‌ 3’ అని టైటిల్ ఖ‌రారు చేశారు.

ముందు సినిమా విజ‌యం సాధించ‌డంతో దాని సీక్వెల్‌పై ఆడియెన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకుంటారు. కానీ తెలుగు, త‌మిళంలో వ‌చ్చిన చాలా సినిమాలు మొద‌టి సినిమా స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రోబోకి సీక్వెల్‌గా 2.0, రాజుగారి గ‌దికి సీక్వెల్‌గా రాజుగారి గ‌ది2, ఆర్య‌కి సీక్వెల్‌గా ఆర్య 2, శంక‌ర్ దాదా ఎం.బీ.బీ.ఎస్‌కి సీక్వెల్‌గా శంక‌ర్ దాదా జిందాబాద్‌, గ‌బ్బ‌ర్ సింగ్‌కి సీక్వెల్‌గా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ వంటి చిత్రాలు చాలా వ‌ర‌కు బాక్సాఫీసు వ‌ద్ద ప‌రాజయాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి.

అయితే కాంచ‌న‌, హిందీలో రూపొందే హౌస్‌ఫుల్, ధూమ్‌, క్రిష్, గోల్ మాల్‌ వంటి కొన్ని సినిమాలు మాత్ర‌మే విజ‌యాన్ని అందుకుంటున్నాయి. సింగంకి సీక్వెల్‌గా వ‌చ్చిన సింగం 2 విజ‌యం సాధించగా, సింగం 3 ప‌రాజ‌యం చెందింది. సినిమా సీక్వెల్ అయినా, స్ట్రెయిట్ అయినా క‌థ‌లో ద‌మ్ముండాలి, ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఉంటూ మంచి వినోదాన్ని పంచేలా, ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఉన్న‌ప్పుడే ఆ సినిమా విజ‌యాన్ని సాధించ‌గ‌ల‌దు. అవ‌న్నీ లేకుండా స‌క్సెస్ ఫార్ములా అని రిపీట్ చేస్తే ఆడియెన్స్ కూడా అదే మాదిరిగా స‌మాధానం చెబుతార‌నేది సినిమా స‌త్యం.

Read more RELATED
Recommended to you

Latest news