కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఓ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నారా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే దేశంలోని పేదలకు ఆహారం, ఉచితంగా గ్యాస్ తదితరాలను అందించడం కోసం గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇక ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు, ఆయా రంగాలకు పూర్వ స్థితి తెచ్చేందుకు మరొక భారీ ఆర్థిక ప్యాకేజీని అతి త్వరలో కేంద్రం ప్రకటిస్తుందని తెలిసింది.
ప్రధాని మోదీ శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర అధికారులతో వరుసగా సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వారు దేశంలో లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు రూ.1 లక్ష కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించవచ్చని తెలిసింది. అయితే దేశంలో ఉన్న వలస కూలీల కోసం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బియ్యం, పప్పు దినుసుల పంపిణీ, పేదల ఖాతాల్లో రూ.1500 నగదు వంటి చిన్న చిన్న పనులు చేసినా.. కూలీలకు వచ్చిన పెద్ద కష్టాన్ని తీర్చేందుకు కేంద్రం ఇంకా ఎటువంటి ప్యాకేజీని ప్రకటించలేదు.
అలాగే దేశంలోని పలు ఇతర రంగాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కూడా కేంద్రం ఇంకా ఎలాంటి ప్యాకేజీని ప్రకటించలేదు. ఆయా దేశాలు ఇప్పటికే తమ జీడీపీలో 10 నుంచి 20 శాతం వరకు నిధులను ఆర్థిక ప్యాకేజీల కింద ప్రకటించినా.. భారత్ మాత్రం ఇప్పటి వరకు ఆ పనిచేయకపోవడంపై అందరూ విమర్శిస్తున్నారు. మరి మోదీ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి..!