ఈ తరానికి అమ్మమ్మలు ఉన్నారా…? ఆ ప్రేమలు ఎక్కడ…?

-

అమ్మమ్మ ను అందరూ అమ్మ తర్వాత అమ్మ అంటారు…కానీ నిజానికి మన అమ్మ కంటే ముందే మనవల పట్ల మమకారం కలిగిన వ్యక్తి ఒక్క అమ్మమ్మ అనే చెప్పాలి…అమ్మ గర్భం దాల్చింది మొదలు తను తన కడుపులో పెరిగే బిడ్డ పట్ల పూర్తి బాధ్యత తీసుకుని ప్రసవం అయ్యే వరకు కంటిపాపలా చూస్కుంటుంది మన అమ్మమ్మ… కానీ నేడు అలాంటి అమ్మమ్మలు కనుమరుగు అవుతున్నారు. ఎంత సేపు నేటి యువతరం లో మార్పు వచ్చింది…వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది అంటున్నారు…కానీ నిజానికి మారింది యువతరం ఒక్కటే కాదు….వారి ముందు తరం వారి ముందు తరం కూడా…

పొత్తిళ్ళలోనీ పసి గుడ్డుకి మొదటి లాల పోసేది అమ్మమ్మే…తన కాళ్ళ మీద ఇంకా కళ్ళు తెరవని పసిబిడ్డను పడుకోబెట్టి ముట్టుకుంటే కందిపోయే ఆ చిన్న శరీరాన్ని నూనె రాసి నలుగు పిండితో బాగా నలిపి రెండు బిందెల వేడి నీళ్లు లాల పోసి, సాంబ్రాణి పొగతో బిడ్డకి వేడి చూపించి,దిష్టి తీసి బొట్టు పెట్టే అమ్మమ్మలు ఎక్కడ… ఈ రోజుల్లో ఎంత మంది అమ్మమ్మలు తమ మనవలకు తొలి లాల పోస్తున్నారు…. ఈ స్థానాన్ని ఆయాలు తీసుకున్నారు…తల్లి తన పాలతో ఆకలి తీరిస్తే అమ్మమ్మ ఉగ్గు పెట్టీ బిడ్డకి బలాన్ని ఇస్తుంది…

అసలు ఇప్పుడు ఉగ్గు నే మర్చిపోయారు వీరు,ఉగ్గు ఎలా చేస్తారు అనేది బహుశా ఇక తెలియకపోవచ్చు… అదొక్కటేనా…! చిన్నప్పుడు అమ్మమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన తమ మనవలను చంకన వేసుకుని వెళ్ళేవారు… వాళ్ళను నడిపించడానికి ఇష్టపడే వారు కాదు…కానీ ఇప్పుడు కట్టుకున్న చీర నలిగిపోతుంది అని పక్కన కూర్చోపెట్టి ప్రేమలు చూపిస్తున్నారు… అన్నం తినిపించడానికి చందమామ ను చూపించి, బూచి వచ్చేస్తాడు అన్నం తినకపోతే అని చెప్పి అన్నం మొత్తం తినే వరకు వారికి ఓపికగా తినిపించిన అమ్మమ్మలను మళ్ళీ చూడగలమా…

ఈ రోజుల్లో శుభ్రత ఎక్కువై స్పూన్ తో తినిపిస్తిన్నారు ఐప్యాడ్ లో ఫోన్ లో వీడియో చూపిస్తూ….ఇలాంటి వాటికి పాపం నవతరం అమ్మమ్మ ల శరీరం సహకరించక యోగా క్లాసుల్లో చేరి అక్కడ నడుము వంచుతున్నారు …. పిల్లలను పడుకోపెట్టేటప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట, ఏడు చేపల కథ ఆనాటి అమ్మమ్మలు ఎన్ని తరాలు నేర్పి ఉంటారు…మరి ఇప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునేది ఇంగ్లీష్ తో మొదలు…ఇక పాటలు కథలు సంగతి చెప్పనక్కరలేదు.. దాదాపుగా ఐదు సంవత్సరాలు వయసు వరకు బాల్యం అమ్మమ్మలతో గడిచేది…ఇప్పుడు డే కేర్ లలో నడుస్తుంది…

సెలవులు కి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అమ్మమ్మ ఇల్లు…ఇప్పుడు ఆ స్థానాన్ని విహాయాత్రలు భర్తీ చేశాయి… ఆత్మీయ స్పర్శ తో పెరిగే పిల్లలు ఆరోగ్యం గా ఉంటారని చాలా పరిశోధనలు చెప్తున్నాయి…మరి అమ్మమ్మ పక్కన పడుకుని నిద్దట్లో కాళ్ళు వేసే రోజులు రాకపోవచ్చు… మనవల కోసం రకరకాల వంటలు చేసి పెట్టే వారి స్థానం లో నచ్చినవి ఆర్డర్ చేసి తెప్పించే కాలం లో ఉన్నాం మనం ఇప్పుడు… మనవలతో కబుర్లు చెప్తూ ఆ చెప్పే కబుర్లలో చుట్టూ ఉన్న సమాజ పరిస్తితి పట్ల పిల్లలకు అవగాహన కలిగించేవారు…ఆ మాటల్లో పిల్లల మానసిక పరిస్తితి నీ అంచనా వేసి తప్పొప్పులను వాళ్లకు అర్దం అయ్యేలా చెప్పే వాళ్ళేరి…

ఈడోచిన్న మనవరాళ్లకు అత్యవసర సమయాల్లో వారికి తోడుగా ఉండి వారికి వయసుతో పాటు వచ్చే అన్ని శారీరక మానసిక మార్పులను వారికి వివరించి ఆయా సమయాల్లో ఆరోగ్య పరిస్తితి నీ వ్యక్తిగత పరిశుభ్రత గురించి యువతరానికి తెలిపే అమ్మమ్మ ఏది ఏమైపోయింది…? అమ్మ దగ్గర కంటే కాస్త ఎక్కువ చనువు అమ్మమ్మ దగ్గరే ఉంటుంది…ఆ చనువుకు దూరమైన వారిలోనే ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న చైల్డ్ అబ్యూజ్ మరియు పిల్లల్లో నేర ప్రవృత్తి కి కారణం…కొత్త గా మనం అన్నింటిలోనూ పాత తరం ఫ్యాషన్ ను అనుసరించడాన్ని చూస్తున్నాం….అది ఇటువంటి మనవసంబందాల విషయాల్లో కూడా వస్తె బావుంటుందని ఎదురుచూద్దాం…త్వరలోనే ఆ రోజులు మళ్ళీ రావాలని ఆశిద్దాం… ఇప్పుడు పిల్లలకు చెడు అలవాట్లు వెంటనే అబ్బడం వెనుక కూడా… ఇలాంటి బంధాలు వారికి తెలియకపోవడమే అంటున్నారు. మంచి చెడు చెప్పే వారు లేక పలు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version