తెలుగు ప్రేక్ష‌కుడు అంటే హీరోలు, ద‌ర్శ‌కుల‌కు ఇంత చిన్న‌చూపా..!

-

తెలుగు సినిమా ప్రేక్షకుడి అభిరుచి నాలుగైదు సంవత్సరాల క్రితమే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు వారసత్వాలు, టాప్ డైరెక్టర్లు, కోట్లాది రూపాయలు ఖర్చు… ఎన్ని పెట్టి సినిమా తీసిన కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తూ వ‌స్తున్నారు. మహేష్ బాబు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్… ఎన్టీఆర్ రభస… అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా… రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలు చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

ఈ సినిమాలకు టాప్‌ డైరెక్టర్లు… ఖర్చుపెట్టిన నిర్మాతలూ లేక‌కాదు.. కష్టపడే హీరోలు లేక కాదు కథ‌, కథనంలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులు వీటిని ప్లాప్ చేసేశారు. అదే టైంలో స్టార్డంతో సంబంధం లేకుండా నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు లో బడ్జెట్ లో కూడా సినిమాలు చేసి బ్లాక్బస్టర్ హిట్లు కొడుతున్నారు. ప్రేక్ష‌కుల‌ అభిరుచికి తగినట్టుగా స్టార్ హీరోలు కూడా తమను తాము మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో ఎవరైతే నేల విడిచి సాము చేస్తారో వాళ్లకు ప్రేక్షకులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సాహోకు ఇదే వ‌ర్తిస్తుంది.

సినిమాలో క‌థ‌, క‌థ‌నాలు అక్క‌ర్లేదు… బాలీవుడ్ నుంచి ఓ మాంచి అంద‌మైన హీరోయిన్‌ను తీసుకువ‌చ్చేశాం… ఆరేడుగురు విల‌న్లు ఉన్నారు. న‌లుగురైదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను పెట్టేశాం… కావాల్సిన‌న్ని ఫైట్లు… ఎంత బాగా ప్ర‌మోష‌న్లు చేశాం… ప్రి రిలీజ్ ఈవెంట్లు పెట్టాం… ఇంకెందుకు చూడ‌రు ప్రేక్ష‌కులు అన్న అతి ధీమాతో సాహోను తీసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. విచిత్రం ఏంటంటే సినిమాలో ట్విస్టులు ఉన్నాయని అంద‌రూ చెపుతున్నా ఆ ట్విస్టులు స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా ముందే ఊహించేస్తాడు.

రాయ్ కొడుకుగా ప్ర‌భాస్ చివ‌ర్లో ఎంట్రీ ఇస్తాడ‌ని సినిమా సాగుతుండగానే అంద‌రూ ఊహించేస్తారు. ఎప్పుడైతే రెండు, మూడు ట్విస్టులు వ‌చ్చాయో నెక్ట్స్ ట్విస్ట్ ఊహించ‌డం ప్రేక్ష‌కుడికి పెద్ద క‌ష్టం కాదు. ఇక హీరోయిన్ పాత్ర హీరోకు ఎదురు తిరగడం ఒక ట్విస్ట్ దీనిని ముందు గానే రివీల్ చేసేసారు.అందువల్ల థియేటర్లో ఈ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఉండవు. పైగా సినిమా మొదటి ముప్పై నిమిషాలు కూడా సాగదీతగానే అనిపిస్తుంది. ఏదేమైనా బ‌ల‌హీన‌మైన క‌థ‌, క‌థనాల‌త‌కు ఆర్భాట‌పు హంగులు జోడించ‌డంకు సాహోకు పెద్ద మైన‌స్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version