గామా పహిల్వాన్ – ఏనుగునే ఒంటి చేత్తో లేపిన కుస్తీ వీరుడు

-

గామా పహిల్వాన్.. భారత వీరుడు, ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆయన ధాటికి ఎంత పెద్ద వీరుడైనా, శూరుడైనా సరే ఎరీనాలోకి దిగితే ఎడమ చేతితోటి నలిపేసేవాడు. మరి అంతటి కండలు తిరిగిన గామా పహిల్వాన్ గురించి తెలుసుకుందాం.

గామా పహిల్వాన్.. అసలు పేరు గులామ్ మహమ్మద్ బక్స్ 22 మే 1878 లో అమృత్ సర్ లో జన్మించాడు. 23 మే 1960 లో మరణించాడు. అతడి కుటుంబం కశ్మీర్ నుంచి పంజాబ్ కు వలస వచ్చింది. ఆయన కుటుంబం మొత్తం పహిల్వాన్లే. వంశపారపర్యంగా వచ్చిన భారీ ఆకారం, బలం వారి సొంతం. కానీ గామాకు ఆరేళ్ల వయసు ఉండగానే అతడి తండ్రి చనిపోయాడు. గామా తండ్రి కూడా పహిల్వానే. కానీ.. అతడి జీవితం అతలాకుతలమైంది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లి కూడా లేదు. ముసలి వయసులో ఉన్న తాత చేరదీశాడు. కానీ.. కొన్నిరోజులకు గామా తాత కూడా మరణించడంతో గామా మళ్లీ ఒంటరి వాడయ్యాడు. కానీ.. గామా పెరుగుతున్నా కొద్దీ అతడిలో ఉన్న బలాన్ని గమనించిన అతడి మేనమామ గామాను చేరదీశాడు. కుస్తీ వైపు వెళ్లమని సలహా ఇచ్చాడు. ఆదిశగా ప్రోత్సహించాడు. పదేళ్ల వయసులో ఉన్నప్పుడు గామా ఊర్లో జరిగే కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. కానీ బలం సరిపోక ఓడిపోయాడు. దీంతో అప్పటి నుంచి తిండి బాగా పెట్టి కుస్తీ ట్రెయినర్ తో గామాకు ట్రెయినింగ్ ఇప్పించాడు గామా మేనమామ. వయసు పెరుగుతున్నా కొద్దీ బలాన్ని పెంచుకొని కుస్తీదారుగా ఎదిగాడు గామా.

జోద్ పూర్ దొర నిర్వహించిన కుస్తీ పోటీల్లో పాల్గొన్న గామా అందరినీ ఆకర్షించాడు. ఓడిపోయినప్పటికీ దొర కూడా అతడి బలానికి ముగ్ధుడయ్యాడు. దీంతో తన దగ్గర ఉన్న పహిల్వాన్లతో దొర గామాకు ట్రెయినింగ్ ఇప్పించాడు. మంచి తిండి కూడా రోజూ పెట్టించాడు. అలా కుస్తీలో అన్ని ట్రిక్స్ నేర్చుకున్నాడు గామా. అతడి దశ తిరిగిపోయింది. 15 ఏళ్లకే గామా 25 ఏళ్ల యువకుడిలా తయారయ్యాడు. జోద్ పూర్ దొర అతడికి ట్రెయినింగ్ ఇప్పించడం వల్ల జోద్ పూర్ దొర తరుపు నుంచే గామా కుస్తీ పోటీలకు దిగేవాడు. ఎక్కడ పోటీకి దిగినా గామా అలవోకగా గెలిచేవాడు. దీంతో ఆ ప్రాంతంలో గామా ఫేమస్ అయిపోయాడు.

మరో కోచ్ దగ్గర గామా చేరి ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఆ కోచే గామాను ఇంటర్నేషన్ ఆటగాడిగా తీర్చిదిద్దాడు. గామాకు చాలా ట్రిక్స్ నేర్పించాడు. అయితే.. గామాకు తిండి పెట్టడమే ఎవరి వల్లా కాకపోయేది. రోజుకు వందమంది తినే ఆహారాన్ని తినేవాడు. జోద్ పూర్ దొర కూడా అతడికి తిండి పెట్టలేక చేతులెత్తేశాడు.

గామా గురించి తెలుసుకున్న దాతియా మహారాజు గామాను చేరదీశాడు. మంచి కోచ్ తో ట్రెయినింగ్ ఇప్పించాడు. అక్కడ కసరత్తులు విపరీతంగా చేసేవాడు గామా. ఒకరోజులో వెయ్యి పుషప్ లు చేసేవాడట గామా, మూడువేల బస్కీలు తీసేవాడట. అలా.. ఎంత తింటే అన్ని కసరత్తులు చేసి తిన్నదంతా అరిగించుకునేవాడట. గామా కసరత్తుల గురించి తెలుసుకున్న బ్రూస్లీ కూడా షాక్ అయ్యాడట. అతడు ఎలా చేస్తున్నాడో తెలుసుకొని అదే పద్ధతి ఫాలో అయ్యాడట బ్రూస్లీ.

ఇక.. 24 ఏళ్లకు ఏకంగా ఏనుగునే ఒంటి చేత్తో లేపాడట గామా. అదే గామా జీవితాన్ని మలుపుతిప్పింది. అప్పటి నుంచి గామా కాస్త ది గ్రేట్ గామాగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. కాకపోతే ఆయన ఏనుగును ఎత్తిన ఫోటో మాత్రం లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. 1910లో ఆయనను ఇండియన్ హెవీ వెయిట్ చాంపియన్ గా బ్రిటీష్ సర్కారు ప్రకటించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా గామ కసరత్తులు చేయడం, దానికి సరిపోయే తిండి తినడం తప్పించి ఇంకేం పని చేసేవాడు కాదు. కాకపోతే ప్రపంచంలోనే నెంబర్ వన్ పహిల్వాన్ కావాలని గామా కలలు కనేవాడు. ఆ కలను నిజం చేసుకున్నాడు గామా. ఇక.. ఆయనకు తిండిని అందించేందుకు మహారాజు ఏకంగా 20 మందిని నియమించాడు. రోజుకు 10 లీటర్ల పాలు తాగేవాడు గామా. 100 గుడ్లు, కిలో బాదం పప్పు, కిలో పిస్తా, పండ్ల రసాలు, 5 కిలోలకు పైగా చికెన్, మటన్ తినేవాడు గామా. వీటితో పాటు తనకు ఇష్టమైన స్వచ్ఛమైన తేనె, నెయ్యి, వెన్నను లాగించేవాడట. ఎంత తిన్నా కసరత్తులు మాత్రం గంటకు ఒకసారి చేసేవాడు గామా.

ఏడు ఫీట్ల ఎత్తు ఉన్న కశ్మీర్ కుస్తీవీరుడు రహీం బక్స్ ను ఓడించి అందరినీ విస్మయానికి గురి చేశాడు గామా. అప్పటి నుంచి ఇక గామా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పోటీ ఏదైనా, ఎవరు ఉన్నా.. గెలుపు గామాదే. కానీ ఒక్కసారి మాత్రం అదే రహీం చేతిలో ఓడిపోయాడు గామా. ఆసమయంలో సరిగ్గా ఆడక ఓడిపోయినట్టు గామానే ఒప్పుకున్నాడు. ఆరోజు రాత్రంతా ఏడ్చాడు. ఓటమంటేనే భయపడిపోయేవాడు గామా. ఆ తర్వాత అదే రహీంను పావుగంటలో ఓడించి కసి తీర్చుకున్నాడు గామా.

1910 లో లండన్ లో పోటీకి వెళ్లాడు గామా. తన చిన్నతమ్ముడు ఇమామ్ ను తోడు తీసుకెళ్లాడు. అయితే.. ఎక్కువ కసరత్తులు చేయడం వల్ల హెవీ వెయిట్ కు సెలెక్ట్ కాలేకపోయాడు గామా. ఇంటర్నేషన్ హెవీ వెయిట్ చాంపియన్ షిప్ లో గామాకు అర్హత లభించలేదు. భారత్ ను పాలిస్తున్న బ్రిటన్ రాణీ గడ్డను ఓడిద్దామనుకున్న గామాకు అవమానం ఎదురైంది. బరువు, ఎత్తు కాదు.. గుండెలో దమ్మున్న మగాడు వచ్చి నాతో కుస్తీ పడి గెలవండి.. అంటూ అక్కడ సవాల్ విసిరాడు గామా. ఒకవేళ తాను ఓడిపోతే ప్రైజ్ మనీ ఎంత ఉందో అంతా ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. నిజానికి అతడి వద్ద అంత ప్రైజ్ మనీ లేకున్నా గెలుస్తానన్న నమ్మకంతో ఆ సవాల్ విసిరాడు. గామా మాటలు విన్న ఓ ప్రమోటర్ ఓ రెజ్లర్ ను రింగ్ లోకి దించాడు. రెండు రౌండ్లను మూడు నిమిషాల్లో ముగించాడు గామా. ఆ తర్వాత ఫైనల్ టోర్నీలో ఒకేరోజు పది మంది పహిల్వాన్లను ఓడించాడు గామా. ప్రీఫైనల్ లో ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ జిబిస్కీతో పోటీ పడాల్సి వచ్చింది గామా. అందరూ భయపడ్డారు. ఇక్కడ గామాకు బ్రేక్ పడుతుందని. ఎందుకంటే జిబిస్కీ ఆజానుబాహుడు. ఎత్తే కాదు.. వెయిట్ లోనూ గామా తక్కువే. ప్రైజ్ మనీ 250 పౌండ్లు ఇంటికి తీసుకెళ్తామా లేదా అని గామా తమ్ముడు టెన్షన్ పడుతున్నాడు. భయ్యా జాగ్రత్త.. అని గామా తమ్ముడు సలహా ఇవ్వబోతే మ్యాచ్ ఎంతసేపు అని అడిగాడు. రెండు గంటలు, ఆరు బ్రేకులని చెప్పాడు. మ్యాచ్ ఐదు నిమిషాలు దాటితే తాను ఇండియా రానని శపధం చేశాడు గామా. అన్న మాటలు విన్న ఇమామ్.. అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడని అనుకున్నాడట. కానీ.. అందరూ ఆశ్చర్యపడేలా నిమిషం లోపు మ్యాచ్ అయిపోయింది. ఆ తర్వాత రౌండ్స్ నేను ఆడలేనని జిబిస్కీ వెళ్లిపోయాడు. ఫైనల్ మ్యాచ్ కూడా రెండు నిమిషాల్లో ముగిసిపోయింది.

1916లో మరో ఇండియన్ సూపర్ రెజ్లర్ పండిమా బిడ్డూతో గట్టి పోటీ ఎదురైంది గామాకు. ఓడిపోలేదు కానీ.. గెలుపుకోసం తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చింది. బిడ్డూ కాసేపు గామాను ఆడుకున్నాడు. చివరకు గామానే గెలిచాడు. తాను ఇప్పటి వరకు ఎదుర్కొన్న వాళ్లలో బిడ్డూనే మగాడు అంటూ గామా తెలిపాడు. 1927 వరకు గామాకు ఎదురొచ్చిన మగాడే లేడు.

అయితే.. ఇంగ్లండ్ రెజ్లింగ్ పోటీల్లో తను ఓడించిన జిబిస్కీ ఇండియా వచ్చాడు. తనతో పోటీకి దిగాలని గామాకు సవాల్ విసిరాడు జిబిస్కో. ఆ పోటీలను బ్రిటీష్ సర్కారు సవాల్ గా తీసుకొని గామాకు కబురు పంపి పాటియాలాలో పోటీలను పెట్టింది. ఈసారి వచ్చిన జిబిస్కీ వేరు. కండలు తిరిగి ఓ పర్వతంలా ఉన్నాడు. ఏది ఏమైనా గామా మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు. జిబిస్కీని ఓడించాడు. ఆతర్వాత ఈ ఇండియన్ టైగర్ తో పోటీపడి గెలిచే మగాడు ప్రపంచలోనే లేడంటూ జిబిస్కీ గామాను పొగిడి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కానీ.. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. దేశ విభజన తర్వాత గామా పాకిస్థాన్ కు మకాం మార్చాడు. అక్కడ చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇండియాలో ఒక భార్యను వదిలేసి పాకిస్థాన్ లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. గామా ఆస్తులు మాత్రం ఏం సంపాదించుకోలేకపోయాడు. అనారోగ్యం పాలైతే మందులు కొనుక్కోవడానికి, ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా గామాను పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న బిర్లా గామాకు కొంత ఆర్థిక సాయం చేశాడు. గామాను ఇండియా వచ్చేయాలని బిర్లా కోరాడు. కానీ.. గామా మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో నెలకు కొన్ని డబ్బులను గామాకు పంపించేవాడు బిర్లా. ఇంతలో బిర్లా గామాకు డబ్బులు పంపిస్తున్నాడన్న విషయం తెలుసుకున్నది పాకిస్థాన్ ప్రభుత్వం. కానీ.. అప్పటికే అంతా అయిపోయింది. గామా అనారోగ్యంతో చనిపోయాడు. ఏది ఏమైనా.. గామాలాంటి బలశాలి ఇప్పటి వరకు ఈ భూమ్మీద పుట్టలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన్ను ఎదుర్కొనేంత దమ్మున్న మగాడు ఇప్పటికీ పుట్టలేదు. హేట్సాప్ గామా.

Read more RELATED
Recommended to you

Exit mobile version