ఈ ‘బాహుబలి’కి ఏమైంది?

1249

ఓ పక్క సిక్స్‌ప్యాక్‌లు, మరోపక్క జీరోసైజులు. మరి సిక్ట్సీసిక్స్‌ ప్యాకేమిటి? ‘సాహో’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ను చూసిన వారందరూ షాక్‌ తిన్నారు. బీభత్సమైన సైజుతో మరో ‘హల్క్‌’లా ఉన్నాడు.

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌… ఆరడుగుల అందగాడు. కళ్లు తిప్పుకోలేని అందంతో, ఖచ్చితమైన దేహదారుఢ్యంతో అమ్మాయిల కలల రాకుమారుడతడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా చర్చ లేవదీసాడు. హీరో అంటే ఇలా ఉండాలనే నిర్వచనాన్ని సృష్టించాడు. ‘మిర్చి’లో ప్రభాస్‌ను చూసి తెలుగువాళ్లందరూ ఫిదా అయిపోయారు… అబ్బాయిలతో సహా..

మరి..
17 ఆగస్టు 2019..సాయంత్రం, రామోజీ ఫిల్మ్‌ సిటీ…..
‘సాహో’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.

షరామాములుగానే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. అప్పటికి ఇంకా ఆ చిత్ర ప్రముఖులు, విశిష్ట అతిథులు రాలేదు. మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంతలో కోలాహలం.. ఈలలు, గోలలు. ఊహించిందే.. హీరోగారు వస్తున్నారు. వచ్చేసారు.

సరే.. వేదిక మీదకు అతిథులను సాదరంగా ఆహ్వానించిన యాంకర్‌.. తరువాత, హీరోగారి పెదనాన్న, నాటి రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గారిని పిలిచింది. ఇక మిగిలింది హీరోగారే.. కేకలు, అరుపులు, చప్పట్ల మధ్య ‘సాహో’ చిత్ర కథానాయకుడు, బాహుబలి ప్రభాస్‌ వేదికనధిరోహించాడు. నలుపురంగు టీషర్ట్‌, జీన్స్‌ ధరించిన ప్రభాస్‌ తన ‘డార్లింగ్స్‌’ అందరికీ హలో చెప్పాడు.

స్టేజి కింద అందరు గుసగుసలు.. ఏమైంది ప్రభాస్‌కు? అలా ఉన్నాడేంటి?… అంతటా ఇదే చర్చ. విపరీతమైన లావుతో, అసలు మెడ ఉందా? లేదా? అనే పరిస్థితి. దానికితోడు కళ్లకింద క్యారీబ్యాగులు. ఎటువంటి అందగాడు ఇలా అయిపోయాడేమిటి అని ఒకటే మధనపడిన అభిమానులు. ‘మిర్చి’ ప్రభాస్‌ను చూసి మైమరిచిపోయిన ఫ్యాన్స్‌, ఈ ‘సాహో’ ప్రభాస్‌ను చూసి బిత్తరపోయారు. చివరికి మాట్లాడిన మాటల్లో కూడా స్పష్టత కొరవడింది. గొంతు పూడుకుపోయినట్లు, నత్తి ఉన్నట్లు మాట్లాడాడు. సినిమా గురించిన డిస్కషన్‌ కంటే ప్రభాస్‌ పర్సనాలిటీ గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది.

39 ఏళ్ల వయసులోనే ఇలా తయారవడం అభిమానులకు అసలు ఏమాత్రం మింగుడుపడటంలేదు. తనకంటే ఎంతో పెద్దవాడైన మహేశ్‌బాబు ఇంకా వయసు పిల్లవాడిలా కనబడుతుంటే, ప్రభాస్‌ ఇప్పుడే ఇలా ఉండటం అమ్మాయిలకు అశనిపాతంలా కనిపిస్తోంది. అసలే ఓ పక్క, పెళ్లీడు దాటిపోయిందని అందరు గోల. సరే…! అనుష్కను చేసుకున్నా పరవాలేదనుకున్నా, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హీరో తన శరీరాకృతి పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఎవరికీ రుచించడంలేదు. వెంటనే తగు శ్రద్ధ తీసుకుని, పర్సనాలిటీని తగ్గించుకునే ఉపాయాలు ఆలోచించకపోతే తీవ్రనష్టం తప్పదు.

– రుద్రప్రతాప్‌