క్షణానికో మారు మారే రాజకీయంలో ఓ కొత్త అధ్యాయం ఇవాళ నమోదు కానుంది. ఓ విధంగా స్థిరమయిన ప్రభుత్వాలు మాత్రమే మంచి పాలన అందిస్తాయి అని గతంలో నిరూపణ అయింది. ఆ కోవలో బీజేపీ నేతృత్వంలో కూటమి స్థిరమయిన ప్రభుత్వ ఏర్పాటుకు మహరాష్ట్రలో అడుగులు వేస్తున్నారు. ఇవి ఫలిస్తే.. మళ్లీ ఫడ్నవీస్ ఆర్థిక రాజధాని ముంబైను శాసించవచ్చు. అదేవిధంగా ఇప్పటికే శక్తి లేక నిర్వీర్యం అయిపోయిన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేను ఇంకా పూర్తిగా నిలువరించవచ్చు.
ఈ పరిణామాలను మొదట్నుంచి బీజేపీ తనకు అనుగుణంగా మార్చుకుని, విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సొంత మనుషులే తనను వెన్నుపోటు పొడిచారన్ని ఉద్ధవ్ ఠాక్రే చెప్పినప్పటికీ రెండేళ్ల ఆయన ఒంటెద్దు పోకడల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు అంటున్నారు. శివసేన సీఎం ఏనాడూ తమకు అందుబాటులో లేరని కూడా పోరుబాట పట్టిన ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ తరుణాన కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏ విధంగా స్థిర రాజకీయాలు చేయనుంది.. అందుకు రెబల్ ఎమ్మెల్యేలు ఏ మేరకు సహకరిస్తారు అన్నదే కీలకం.
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఇప్పటికే బీజేపీ సంప్రతింపులు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. ఫడ్నవీస్ తన తరఫున తన అధీనంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే స్వతంత్రుల మద్దతు కూడా తప్పని సరి ! ఇప్పుడు ఇవే చర్చకు తావిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన రెబల్స్ ను ఒప్పించగలరో అన్నదే ముఖ్యం.