నన్ను రాష్ట్రపతిగా ఎంపిక చేశారని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాను అని అంటున్నారామె. ఆమె ఎవరు ? ద్రౌపదీ ముర్మూ. గతంలో వినిపించిన పేరే.. ఆ మాటకు వస్తే మొన్నటి వేళ కూడా వినిపించిన పేరే .. ప్రథమ మహిళ దేశాన్ని నడిపే వేళ రానుంది. ఆమెకు స్వాగతం చెప్పండి. మహిళలను తేజోమూర్తులుగా మలిచే శక్తిమంతం అయిన పనులే ఆమె చేయాలని కోరుకోండి. దేశాన్ని నడిపే శక్తుల తప్పులు ఉంటే వాటిని సవరించే శక్తి ఆమే కావాలి అని దైవాన్ని ప్రార్థించండి.
ద్రౌపది ముర్మూ .. అనే గిరిజన మహిళ రేపటి మన దేశ ప్రథమ పౌరురాలు.
ద్రౌపది ముర్మూ .. అనే గిరిజన మహిళ రేపటి మన దేశ ప్రథమ పౌరురాలు.
దేశాన్ని ముందుకు నడిపే శక్తిమంతం అయిన మహిళల ఎంపిక ఒకటి ఇప్పుడు అవసరం అని భావించాలి. రేపటి వేళ వీళ్లే మరికొందరిని తయారు చేయగలరని భావించాలి. ఆ కోవలో ఆ తోవలో రాష్ట్రపతి ఎన్నికల కాస్త సహకారం అందించగలవు. ఆ కోవలో ఆ తోవలో బీజేపీ (బీజేపీ అనే కన్నా బీజేపీ కూటమి అని రాయాలి) రాష్ట్రపతి అభ్యర్థి, ఒడిశా టీచరమ్మ ద్రౌపదీ ముర్మూ పేరు కన్ఫం చేశారు. శక్తిమంతం అయిన మహిళల రాక కారణంగా దేశం మరింత పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో ఈ పని చేసి ఉంటారు. లేదా విపక్షాలకు మరో ఆలోచనకు తావివ్వక చేసిన ఎత్తుగడలో భాగంగా ఆమె పేరు వినిపిస్తోంది అని కూడా అనుకోవచ్చు. ఒడిశా నేలల నుంచి నడయాడిన ఆ మాతృరూపం దేశాన్ని శాసించే శక్తిగా ఎదగాలని, అలంకార ప్రాయ పదవి అది కాదని చెప్పే ప్రయత్నం ఒకటి మనమంతా చేయాలి. ఆ విధంగా రాజకీయాలను, ఉద్దేశ, దురుద్దేశ రాజకీయాలను వేరు చేసి చూడవచ్చు కూడా !
ఇప్పటికిప్పుడు దేశానికి కొత్త శక్తి ఎందుకు కావాలి అంటే.. మంచి మార్పులకు శ్రీకారం దిద్దే ప్రయత్నాలు కొన్ని జరగాలి. ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ఆమె ఇటువంటి మార్పులకు కారణం కావాలి. పార్టీలు వాటి నిర్ణయాలు కారణంగా ఆమె ఇప్పుడు తెరపైకి వచ్చారు. రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు. ఆ కారణాలను అటుంచితే రేపటి వేళ ఇంకాస్త సమర్థతను పోగేసుకుని ప్రయాణిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అనేక తర్జన భర్జనల తరువాత వినిపించిన పేరు కావడంతో దేశం యావత్తు ఆమె ఎవరు ఎక్కడుంటారు ఏం చదువుకున్నారు రాజకీయ నేపథ్యం ఏంటి ఇలాంటివెన్నో ఆరా తీస్తుంటారు. దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సారి ఉత్తరాది నేతలు ప్రాధాన్యం వహిస్తున్న ఎన్డీఏ కూటమి భావించడం శుభ పరిణామం. అదేవిధంగా ఈ తూర్పు రాష్ట్రాలకు కాస్తో కూస్తో నిధులు ఇచ్చి ప్రగతి కారక శక్తులకు చేయూత నిస్తే ఇంకా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.