ఆయుర్వేదం.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య విధానంగా పేరుగాంచింది. ఎన్నో వందల వ్యాధులకు ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి. డబ్బే ప్రపంచంగా మారిన నేటి తరుణంలో అసలైన ఆయుర్వేద వైద్యాన్ని అందించే వారు తక్కువయ్యారు. కానీ నిజానికి దాదాపుగా ఏ రోగాన్ని అయినా నయం చేసే శక్తి ఆయుర్వేదానికి ఉంటుంది. అధునిక వైద్య విధానం ఎన్నో అద్భుతాలను సాధిస్తుంది, నిజమే. అయితే సాంప్రదాయ వైద్య విధానాన్ని మనం ఎన్నడూ మరువకూడదు.
చిన్న దగ్గు, జ్వరం, జలుబు వస్తే మనం ఇంట్లో ఉండే వంటి ఇంటి పదార్థాలతోనే చికిత్స చేసుకుంటాం. ఎందుకంటే ఆ పదార్థాలతో ఆయా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని తెలుసు. ఈ వైద్యాన్ని ఆయుర్వేదం అందించింది. ప్రస్తుతం ఆయుర్వేదానికి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. అయినప్పటికీ దాన్ని అణచివేసే ప్రయత్నం సాగుతోంది. ఎందుకంటే.. తక్కువ ఖర్చుతో చికిత్స అయిపోతే జనాలు ఆధునిక వైద్యం వైపు వెళ్లరు కదా. అందుకనే ఆయుర్వేదాన్ని అణచివేసేందుకు కార్పొరేట్ మెడికల్ మాఫియా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయుర్వేదాన్ని అశాస్త్రీయమని వాదనలు చేస్తూనే ఉంది. తాజాగా కృష్ణ పట్నం ఆనందయ్య విషయంలోనూ ఇలాగే జరుగుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఆనందయ్య పంపిణీ చేసే మందుకు శాస్త్రీయత లేకపోవచ్చు. అంత మాత్రం చేత దాన్ని కొట్టి పారేయలేం. దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సాక్షాత్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖే చెప్పింది. అలాంటప్పుడు మందు పంపిణీని ఆపడం ఎందుకనేది ప్రశ్న ? ఇక ఆనందయ్య పంపిణీ చేసే మందు పనిచేస్తుందనే అనుకుందాం. అలాంటి తక్కువ ఖర్చు కలిగిన మందు మెడికల్ మాఫియా వల్ల బయటకు వస్తుందా, దాన్ని రానిస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బయటకు వస్తే ప్రజలను దోచుకుంటున్న మెడికల్ మాఫియా ఆగడాలు సాగవు కదా. వారికి కాసుల వర్షం ఉండదు కదా. కనుక ఒక వేళ ఆనందయ్య మందు నిజంగానే పనిచేస్తుందనుకున్నా.. ఆ మందు బయటికి రావడం అనేది అసంభవమనే చెప్పవచ్చు. ఏదో ఒక వంకతో ఆనందయ్య మందును ప్రజలు మరిచిపోయేలా చేస్తారు. కొంత కాలం తరువాత ఆనందయ్య ఎవరో కూడా తెలియనంతగా మసిపూసి మారేడు కాయ చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలను చాలా చూశం. మరి ఆనందయ్య విషయంలోనూ ఇలాగే జరుగుతుందా, లేదా ? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.