వెయ్యి నియామకాలు చేపట్టనున్న జర్మన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం!

జర్మన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిచే బ్యాంక్‌ మెరుగైన సేవలు కస్టర్లకు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 1000 నియామకాలు చేపట్టింది. మారుతున్న కస్టమర్ల అవసరాల సందర్భంగా ఫ్రెషర్, అనుభవం ఉన్న ప్రొఫెష్‌న ల్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటోంది. జర్మన్‌కు చెందిన డాయిచే, ప్రపంచవ్యాప్తంగా దీని సేవలను అందిస్తోంది. పెరుగుతున్న ఫైనాన్షియల్‌ అవసరాల దృష్ట్యా తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను విస్త్రతి చేస్తోంది.

ఇందులో భాగంగానే 2019–2021 మధ్య 13 బిలియన్‌ యూరోల మేర కేటాయించింది. డాయిచే బ్యాంక్‌ కార్యకలాపాల్లో భారత్‌ ప్రధాన వ్యాపార కేంద్రం. అందుకే, ఇక్కడ మరో 1000 మంది టెక్‌ నిపుణులను రిక్రూట్‌ చేసుకోవాలని నిర్ణయించింది. ‘భారత్‌లో తమ బ్యాంకుకు అవసరమైన టెక్నాలజీ అందించేందుకు, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు మరో వెయ్యి మంది ఐటీ నిపుణులను రిక్రూట్‌ చేసుకోనున్నాం. ప్రధానంగా మేం ఇంజినీరింగ్, కోడింగ్‌ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని కార్పొరేట్‌ ఫంక్షన్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్, డాయిచే బ్యాంక్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ దిలీప్‌కుమార్‌ ఖండేల్వాల్‌ అన్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రాల విస్తరణకు కంపెనీ నాలుగు దేశాలను ఎంపిక చేసుకుంది. వాటిలో భారతదేశం మొదటిది. భారత్‌లో డాయిచే బ్యాంక్‌ టెక్‌ సెంటర్‌లో ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా తీసుకునే 1000 మందితో కలిపి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,000 అవ్వనుంది. డాయిచే బ్యాంక్‌కు రష్యా, యూఎస్, రొమేనియా వంటి దేశాల్లో కూడా తన టెక్‌ సెంటర్లను విస్తరించనుంది.ఈ కేంద్రాల్లోనే ఇంజినీరింగ్‌ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో నియామకాలు చేపట్టి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది డాయిచే.