మేజర్ ఆచార్య, ఇతర సైనికులు కలిసి టోలోలింగ్ పీక్ దిశగా ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆ ప్రాంతాన్ని పాక్ సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని ఉంచి భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
అది 1999, జూన్ 28. కార్గిల్ యుద్ధం జరుగుతున్న రోజులు.. పాకిస్థాన్ మూకలు ఆక్రమించుకున్న భారత భూభాగాలను మన జవాన్లు ఒక్కొక్కటిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కార్గిల్ వద్ద ముందుకు సాగుతున్నారు. పాక్ సైనికులకు దీటుగా జవాబిస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ చేపట్టింది. కార్గిల్‌లోని లోన్ హిల్, టోలోలింగ్ పీక్ అనే ముఖ్యమైన స్థావరాలు రెండింటిని స్వాధీనం చేసుకోవడం కోసం కంపెనీ కమాండర్ మేజర్ పద్మపాణి ఆచార్య నేతృత్వంలో భారత సైనికులు ముందుకు కదిలారు.
మేజర్ ఆచార్య, ఇతర సైనికులు కలిసి టోలోలింగ్ పీక్ దిశగా ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆ ప్రాంతాన్ని పాక్ సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని ఉంచి భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు మేజర్ ఆచార్య, కొద్ది మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అయినా భారత జవాన్లు వెనుకడుగు వేయలేదు. పాక్ సైనికులను అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. మేజర్ ఆచార్య ఓ బంకర్ ను గుర్తించాడు. వెంటనే అక్కడికి పాకుతూ గ్రెనేడ్లతో పాక్ సైనికులపై దాడి చేశాడు. పెద్ద ఎత్తున పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ దాడిలో మేజర్ ఆచార్యకు కూడా తీవ్రగాయాలయ్యాయి. అయినా తన ఆధ్వర్యంలో ముందుకు నడుస్తున్న జవాన్లకు తనను పట్టించుకోవద్దని, ముందుకు వెళ్లమని చెప్పాడు. ఆ తరువాత భారత్ ఆ రెండు స్థావరాలను విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. తరువాత కొన్ని రోజులకు ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయింది. పాక్ సేనలు తోక ముడిచాయి. భారత్ కార్గిల్ యుద్ధంలో గెలిచింది. అలా ఓ అమరవీరుడి త్యాగంతో భారత త్రివర్ణ పతాక్ రెపరెపలాడింది.
మేజర్ ఆచార్య ఆ రోజు యుద్ధంలో దిగేందుకు సరిగ్గా వారం ముందు.. అంటే.. జూన్ 21వ తేదీన ఆయన తన 31వ జన్మదినాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. అప్పటికి ఆయన భార్య చారులత 6 నెలల గర్భిణి. అయితే దురదృష్టవశాత్తూ ఆచార్య యుద్ధంలో మృతి చెందాడు. దీంతో ఆయన తన కూతుర్ని చూసుకునే భాగ్యం కూడా తనకు దక్కలేదు. ఇక యుద్ధంలో మేజర్ ఆచార్య చూపిన ధైర్య సాహసాలకు ఆయనకు భారత ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది. దాన్ని ఆచార్య తండ్రి అందుకున్నారు. ఇక యుద్దంలో తాను కొంత సేపైతే చనిపోతాననగా ఆచార్య తన తండ్రికి ఒక లెటర్ కూడా రాశారు. దాన్ని ఆ తరువాత సైనికులు ఆచార్య తండ్రికి అందజేశారు.
”నాన్నా.. భారత సైనికులు చనిపోతున్నారని కంగారు పడకు. అది మాకు మామూలే. దాంతో మనకు అంతా మంచే జరుగుతుంది..” అనే వాక్యాలు.. ఆచార్య తన తండ్రికి రాసిన లెటర్‌లో ఉన్నాయి. వాటిని చదివితే ఎవరికైనా సరే.. కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇక ఆచార్య కుమార్తె అపరాజితకు ఇప్పుడు 19 ఏళ్లు. ఆమె తల్లి కడుపులో ఉన్నప్పుడే తన తండ్రి మృతి చెందాడు. అయినా సరే.. ఆమె బాధపడలేదు. తన తండ్రి ధైర్య సాహసాలను ఆమె అందరికీ చెబుతూ ఉంటుంది. అవును.. అలాంటి ఎంతో మంది సైనికుల త్యాగఫలమే.. నేడు మనం జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్‌కు నిదర్శనం.. జోహార్… అమర సైనికులకు.. జోహార్..!