రక్షాబంధన్ పర్వదినం వచ్చిందంటే.. భారతదేశంలో ఏ ఒక్క సోదరుడి చేయి ఖాళీగా ఉండదు. అందరి చేతులు రాఖీలతో నిండి కళకళలాడుతూ ఉంటాయి. కొందరి తోబుట్టువులు దూరప్రాంతాల్లో ఉంటారు. మరికొందరి సోదరులు ఇంటి నుంచి దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తోబుట్టువులు తమ సోదరులకు రాఖీని పోస్టులో పంపిస్తుంటారు. అచ్చం ఇలాగే హరియాణా పోస్టాఫీసుకి కూడా రాఖీ పౌర్ణమి వచ్చిందంటే రాఖీలు పోస్టు చేయాలని వస్తుంటాయి. కానీ ప్రతి రక్షాబంధన్ కి హరియాణాలోని రోహ్ తక్ పోస్టాఫీసు ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. అదేంటంటే.. ప్రతి రాఖీ పౌర్ణమికి ఈ పోస్టాఫీసుకి వెలల్లో రాఖీలు వస్తుంటాయి. అందులో కొత్తేం ఉంది అంటారా.. ఆగండాగండి.. ఆ వేల రాఖీలు ఒకే వ్యక్తికి వస్తున్నాయంట. పెద్దపెద్ద బస్తాల్లో నింపి పోస్టాఫీసు సిబ్బంది ఆ వ్యక్తికి ఈ రాఖీలను చేరవేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..
కొన్నేళ్లుగా రక్షాబంధన్ సమయంలో హరియాణాలోని రోహ్ తక్ పోస్టాఫీసు ఉద్యోగులు విచిత్ర సమస్య ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా సునారియా జైలులో ఉన్న డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు వేలకొలది రాఖీలను వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పంపిస్తున్నారు. వాటిని వేరు చేసి, జైలుకు తరలించలేక తపాలా ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమిస్తున్నారు. గతేడాది సుమారు 40 వేల రాఖీలు వచ్చాయని.. ఈ సారి పూర్తిగా లెక్కింపు జరగలేదని పోస్టాఫీస్ ఉద్యోగులు చెబుతున్నారు.
సాధారణంగా మనలో చాలామందికి ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే పది మంది వరకు అక్కాచెల్లెళ్లు ఉంటారు. రక్షా బంధన్ నాడు వారంతా వచ్చి రాఖీలు కట్టి తమ ప్రేమను చూపిస్తారు. కానీ సూరత్ కు చెందిన చిరాగ్ దోషి అనే ఓ వ్యక్తికి మాత్రం 1,540 మంది సోదరీమణులు ఉన్నారు. వారందరూ ఏటా రక్షాబంధన్ రోజు చిరాగ్ కు రాఖీలు కడతారు. అందుకు ఒక్క రోజు సమయం సరిపోదని.. అతడు ఏకంగా వారం రోజులపాటు రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటాడు.