అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు..

-

కృష్ణ..కృష్ణ అనని భక్తులు ఉండరు. చిన్ని కృష్ణుడును తలవని తల్లులు ఉండరు. సంపూర్ణ విష్ణు అవతారమైన కృష్ణావతరాం ఎలా ప్రారంభమైంది. విశేషాలు తెలుసుకుందాం…

అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు.

చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు.

నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు. మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. ఇలా చిన్నవయసులో కృష్ణుడు లీలలు ప్రారంభమయ్యాయి.

దశమస్కందంలో కృష్ణావతార లీలలు

రేపల్లెలో పెరుగుతున్న శ్రీకృష్ణుడిని సంహరించాలన్న మేనేమామ కంసుడి దాడులు… కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు.

తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. .

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version