తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. పారిశ్రామిక ప్రగతిని వివరించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సరళతరం, తదితర విషయాలను అందరికీ వివరిస్తారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, తద్వారా పెరిగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల వివరాలను అందరికీ తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీహబ్, వీహబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశాలు నిర్వహించడంతో పాటు.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా అయ్యేందుకు చేసిన కృషిని వివరిస్తారు. దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. నైపుణ్య అభివృద్ధి కేంద్ర, కామన్ ఫెసిలిటీ సెంటర్, వ్యర్థాల శుద్ధి కేంద్రం, ఐలా కార్యాలయం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. తెలంగాణ టాయ్స్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.