తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. ఓవైపు జూన్ 2 నుంచి 22 రోజుల పాటు అట్టహాసంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు సర్కార్‌కు పోటీగా.. కాంగ్రెస్ పార్టీ కూడా 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అవతరణ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వేడుక కానుంది.
గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జూన్ 2న ఉదయం 6.30 గంటలకు కోటలో జాతీయ పతాకాన్ని ఎగరేయనున్నట్లు సమాచారం. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గాయకుడు శంకర్ మహదేవన్, జానపద గాయని మంగ్లీ తదితరులను ఆహ్వానించారు. గతేడాది సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.