ప్రస్తుత కాలంలో ఒకరిపై ఒకరు ఆధారపడడం చాలా సాధారణం గా మారింది. ప్రతి విషయంలోనూ మన చుట్టూ ఉన్నవారి సహాయం తీసుకుంటూ ఉంటాం. ఆర్థికంగా, మానసికంగా, ప్రతి పనిలోనూ పక్కవారిపై ఆధారపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరు సహాయం కోసం చెయ్యి చాచడం మొదలుపెడితే కొన్ని రోజుల తర్వాత ఏ పని చేయలేని స్థితికి తయారవుతారు. మరి ఇతరుల సహాయం పై ఆధారపడడం మంచిదేనా? లేదా అది మనల్ని బలహీనపరుస్తుందా? నిపుణులు ఈ విషయంపై ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతరులపై ఆధారపడడం మంచిదా కాదా అన్నది ఆ పరిస్థితి పై దానివల్ల కలిగే ఉపయోగాలు నష్టాలపై ఆధారపడి ఉంటుంది. పూర్తిగా ఒకరిపై ఆధారపడడం ఆరోగ్యకరం కాదు. ఇది సమస్య పరిష్కార సామర్థ్యం కోల్పోవడం అంటే ఒకరు నిరంతరం ఇతరుల సహాయం పై ఆధారపడితే వారి సమస్యలను వారే పరిష్కరించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో చిన్న సమస్యలను కూడా ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.
ఇతరులపై ఆధారపడేవారు సొంతగా ఏ పని చేయలేరనే భావన కలిగి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. చివరికి వారిలో వారే మదనపడే స్థితికి చేరుకుంటారు. వారికి భవిష్యత్తులో కొత్త పనులు చేయడానికి వెనుకడుగు వేసేలా చేస్తుంది. ఒకరు పూర్తిగా ఇతరులపై ఆధారపడినప్పుడు ఆ సంబంధం వారిపై ఒత్తిడి పెంచుతుంది. ఇది భవిష్యత్తులో సంబంధాలలో అపార్థాలకు, కలహాలకు దారితీస్తుంది.

ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఇతరులపై ఆధారపడడం వల్ల కొత్త నైపుణ్యాలను నేర్చుకోలేరు. మీకు వచ్చిన పని కూడా వేరే వారిపై ఆధారపడి చేస్తుంటే మీరు ఆ వృత్తిలో ఎలా అభివృద్ధి చెందుతారు. అది మీ వృత్తిపరమైన అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తుంది.
అవసరమైనప్పుడు సలహాల కోసం సహాయం కోసం ఇతరులపై ఆధారపడడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకి మనం ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు సీనియర్ల సహాయం తీసుకోవడం స్నేహితుల సలహాలు అడగడం మంచిదే. అంతేకానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మనం చేయాల్సిన పని కూడా ఇతరులపై ఆధారపడితే కొన్ని రోజుల తర్వాత పనిచేయాలని ఉత్సాహాన్ని కూడా కోల్పోతారు.
అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం మంచిదే కానీ ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడడం ఆరోగ్యకరం కాదు. సొంతగా నిర్ణయాలు తీసుకోవడం సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మన జీవితంపై మనకు పట్టు లభిస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.