లక్ష్యాన్ని చేరే ధృడమైన సంకల్పాన్ని పెంపొందించుకుందాం ..!

-

ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులూ హరించుకుపోతాయి. కొందరి కాంక్షలు సామాజికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. మరికొందరివి ఆధ్యాత్మికత ఉన్నతి, కళారాధన చుట్టూ, ఇంకొందరివి ధన సంపాదన చుట్టూనూ పరిభ్రమిస్తుంటాయి.

 

ఎంసెట్‌ ర్యాంక్‌ తెచ్చుకోవాలనో, మంచి జాబ్‌లో సెటిల్‌ అవాలనో, ఆర్థికంగా, సామాజికంగా బాగా స్థిరపడాలనో, జగమెరిగే కళాకారుడిగా మిగిలిపోవాలనో, జీవితాన్ని అపురూపంగా చక్కబెట్టుకోవాలనో.. ఏదో లక్ష్యం నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. లక్ష్యం నిర్దేశించుకోవడం తెలియకపోతే లోపల ఊరకుండని అగ్ని.. కోరికలుగా పరివర్తన చెందుతుంది. ఆ అగ్నికుండే తత్వమే ఏదో ఒక దాన్ని జ్వలింపజేయడం! అది లక్ష్యం కావచ్చు, కోరిక కావచ్చు. దాన్ని లక్ష్యం వైపు మళ్లిస్తే ‘భవిష్యత్‌’ ఉన్నతంగా నిర్మితమవుతుంది.

అస్పష్టమైన ఆలోచనాసరళి, గమ్యమెరుగని ప్రయాణం మనలోని నిర్ణయాత్మక శక్తిని నిర్వీర్యం చేసి మన శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవడానికి వీల్లేకుండా ప్రతిబంధకమవుతాయి. ఆ ఊగిసలాటలో మనలోని అపరిమితమైన శక్తీ.. లక్ష్యం కన్పించక, అసంతృప్తితో మనవైపే వెనక్కి మళ్లింపబడుతుంది.

 

మనలో ఏదైనా శూన్యత, అసంతృప్తి ఏర్పడితే దాన్ని వెంటనే గుర్తించి వీలైనంత త్వరగా చక్కని లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే మానసికంగా వ్యాకులత ఆవరిస్తుంది. జ్వాల రగిలినంతకాలం దానికి లక్ష్యాలో, కోరికలో.. ఆ రెండూ లేకపోతే ఆలోచనలో ఆహుతి కావలసిందే. మనలో జ్వలించే యావత్‌శక్తినీ కేంద్రీకరిస్తే ఎంతటి క్లిష్టమైనదైనా ఇట్టే దాసోహమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version