అయోధ్య రామమందిర భూమిపూజ భారతజాతి ఐక్యతకు, సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ఎన్నో తరాలుగా శ్రీరాముని వ్యక్తిత్వం భారత ఉపఖండం ఐక్యతకు రక్షరేకులా నిలిచింది. భారత ఉపఖండంతో పాటు ప్రపంచ నాగరికతపై రామాయణం తిరుగులేని ముద్ర వేసిందని, శ్రీరాముడు అందరివాడని, ప్రతి ఒక్కరి సౌఖ్యాన్ని కోరుకున్నాడని తెలిపింది. అందుకే ఆయన మహోన్నత పురుషోత్తముడిగా భాసిల్లుతున్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజ దేశఐక్యతను చాటడం సహా ఆ శ్రీరాముడు ఆశీర్వాదాల్ని, ఆయన లోకకల్యాణ సందేశాన్ని ప్రజలకు చేరువేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.
రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా అయోధ్యలో మంగళవారం ‘రామార్చన పూజ’ నిర్వహించారు అర్చకులు. వేదమంత్రాలను జపిస్తూ పూజలు చేశారు. భూమిపూజ కోసం తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు అర్చకులు. భూమిపూజ నేపథ్యంలో లక్షకుపైగా లడ్డూలను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది బిహార్ పట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్. ఈ లక్ష ‘రఘుపతి లడ్డు’ల్లో 51వేల లడ్డూలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అందివ్వనుంది. మిగిలినవి ఇతర ప్రసిద్ధ ప్రాంతాలకు పంపించనుంది.