కరోనా లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను అమెరికా ప్రత్యేక విమానాల ద్వారా తమ దేశానికి రప్పిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు అమెరికా మొత్తం 50వేల మందిని విమానల్లో వెనక్కి తీసుకువచ్చింది. అయితే భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లలో చాలా మంది మాత్రం తమ సొంత దేశానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కన్నా ఇండియాలోనే ఉండడం ఉత్తమమని భావించి వారు అమెరికా పంపిన విమానాల్లో తమ దేశానికి వెళ్లేందుకు ముందుకు రావడం లేదు.
ప్రస్తుతం భారత్‌లో అమెరికాకు చెందిన పౌరులు మొత్తం 24వేల మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తొలి దశలో 800 మందిని అమెరికాకు తీసుకెళ్లేందుకు అక్కడి అధికారులు ఇండియాకు విమానాలను పంపగా.. వారిలో కేవలం 10 మంది మాత్రమే అమెరికా వెళ్లేందుకు ముందుకు వచ్చారట. దీన్ని బట్టి చూస్తే అమెరికా పౌరులే తమ దేశం పేరు చెబితేనే వణికిపోతున్నారని అర్థమవుతోంది. అందుకనే చాలా మంది అమెరికా వాసులు ఇండియాలోనే ఇంకొంత కాలం ఉందామని అనుకుంటున్నారు.
ఇక బ్రిటన్‌కు చెందిన పౌరులు ఇండియాలో 35వేల మంది ఉండగా.. వారిలో 20వేల మంది మాత్రమే తమ దేశానికి వెళ్లిపోయారు. మిగిలిన వారు అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా లేరని.. అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి మెరుగయ్యాక వీరందరూ తమ తమ సొంత దేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని.. అధికారులు భావిస్తున్నారు.