స్పెయిన్ దేశంపై కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే 2వేల కొత్త కరోనా కేసులు అక్కడ నమోదయ్యాయి. 100 మంది మరణించారు. దీంతో స్పెయిన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య మొత్తం 7753కు చేరుకోగా, ఇప్పటి వరకు అక్కడ ఈ వైరస్ కారణంగా మొత్తం 288 మంది మృతి చెందారు. దీంతో స్పెయిన్ తమ దేశాన్ని నిర్బంధించింది. ప్రజలను పూర్తిగా ఇళ్ల వద్దే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను, ఆమెను ఇద్దరినీ ఇంటికే పరిమితం చేశారు. వారు 15 రోజుల పాటు ఇంటి వద్దే ఉండనున్నారు. ఈ క్రమంలో శాంచెజ్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరప్ దేశాల్లో ఇటలీ తరువాత స్పెయిన్‌లోనే అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆహారం, మెడిసిన్, ఉద్యోగం కోసం తప్ప.. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా స్పెయిన్‌లో 1975, 2010 తరువాత మళ్లీ ఇప్పుడే ఎమర్జెన్సీ విధించారు. 1975లో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణం సమయంలో, 2010లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె కారణంగా స్పెయిన్‌లో ఎమర్జెన్సీ విధించగా మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ మూలంగా ఎమర్జెన్సీ విధించారు. అయితే రానున్న రోజుల్లో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 10వేలు మించుతుందని అక్కడి వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.