దేశంలో ఆదివారం వరకు 107 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సార్క్ మీటింగ్‌లో కరోనాను మూకుమ్మడిగా ఎదుర్కొందామంటూ పిలుపునిచ్చారు. కాగా మరో వైపు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం కరోనాపై కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే…
కరోనా వైరస్ నిర్దారణ కోసం చేసే వైద్య పరీక్షల్లో మొదటి రెండు టెస్టులను ఉచితంగానే చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకునే వారికి మొదటి రెండు పరీక్షలను ఉచితంగానే చేస్తున్నామని, వాటికి ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదన్నారు. కేవలం కరోనా అనుమానితులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇక కరోనా టెస్టులు చేసేందుకు కావల్సినంత కెపాసిటీ ప్రస్తుతం భారత్ వద్ద ఉందని తెలిపారు. అయితే అందులో ప్రస్తుతం మనం కేవలం 10 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు.
ఇక కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయవద్దని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ క్రమంలో ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే 011-23978046 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ ఫోన్‌కు కాల్ చేశాక ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలకు అర్హత సాధిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.