ఈ జన్మలో చూస్తామనుకోలేదు… గంగానదిలో డాల్ఫిన్స్!

-

కరోనా రావడం మంచిదా చెడ్డదా అంటే… మొదట్లో మాత్రం… ఏమిటండీ ఇది, లోకంలో పాపం పేరుకుపోయిందన్ని ఒకరంటే… చైనా వాడి నక్క చేష్టలు అండి ఇవి అని మరొకరన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో కూడా… ఏమిటండి ఈ దరిద్రం… రోజంతా ఇంట్లో లుంగీలు కట్టుకుని, మెడచుట్టూ పౌడర్ రాసుకుని, టీవీ రిమోట్ లో బటన్స్ పై అంకెలు చెరిగిపోయే స్థాయిలో వాడేయడం అని! ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి… కరోనా వల్ల లక్షల సంఖ్యలో జనాలు ఇబ్బందులు పడుతున్నారు, మరణిస్తున్నారు… అయినా కూడా ఎక్కడో జనాలకు కరోనాపై మెల్ల మెల్లగా కోపం తగ్గుతున్న దశ ప్రారంభమైంది! అందుకు కారణమైన ఒక సంఘటన ఇప్పుడు చూద్దాం…

వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని “క్లీన్ గంగా”… లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదంట. అవును… వారణాశిలోని పవిత్ర గంగా నదిలో నీటి నాణ్యత పెరిగిందని, దశాబ్దాలలో లేనివిధంగా హరిద్వార్ లోని గంగానీరు ఏకంగా తాగేందుకే ఉపయోగపడిపోతుందని ఇటీవల వార్తల్లో చూసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ఫార్మా కంపెనీలు మిన‌హా దాదాపు అన్ని ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డటం, ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు లేక‌పోవ‌డంతో ఒక్క గంగానది మాత్రమే కాదు… నిరంతరం భారీ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీలోని యమునానది సహా అన్ని రాష్ట్రాల్లోని న‌దులు, స‌ర‌స్సులలోని నీరు శుద్ధి అవుతుందట!

గంగానదిలో నీరు ఎంతలా శుద్ది అయిపోయిందంటే… గంగానదిలో డాల్ఫిన్లు చక్కర్లు కొడుతూ కొనిపించేటంత. ఉత్తరప్రదేశ్ లోని మీర‌ట్ లోని గంగాన‌దిలో డాల్పిన్ లు ఎంచ‌క్కా చ‌క్క‌ర్లు కొడుతూ క‌నిపించాయట. సాధార‌ణంగా అతి చిన్న క‌ళ్లు, త‌క్కువ చూపుండే డాల్ఫిన్లు శుద్ద‌మైన నీటిలోనే నివ‌సిస్తుంటాయి. ఇపుడు గంగా న‌దిలో డాల్ఫిన్ లు ఈత కొడుతుంటే.. ప‌విత్ర గంగా న‌ది శుభ్ర‌మైన‌ట్లేన‌నిపిస్తోందంటున్నారు. దీంతో… మీరట్ లోని గంగా నదిలో ఈ డాల్ఫిన్లను గుర్తించడం తన అదృష్టమని భారత అటవీ శాఖ అధికారి ఆకాష్ దీప్ బాధవన్ ఒక వీడియోను కూడా షేర్ చేశారు.

ఏది ఏమైనా… గంగా నదిని మనిషి నాశనం తన మూర్ఖత్వంతో అడ్డమైన గడ్డీ అందులో వేసి, పనికిమాలిన మునకలన్నీ అందులో మునిగి నాశనం చేశాడు… మళ్లీ ఆ మనిషితోనే ఆ నదిని శుభ్రం చేయించింది ప్రకృతి. అనుకుంటాం కానీ… అన్ని విషయాలు అందరికీ అర్ధం కావు కదా!!

Read more RELATED
Recommended to you

Latest news