క‌ర్ణాట‌క వాసుల‌కు బిగ్ రిలీఫ్‌.. మే 3 త‌రువాత దాదాపుగా అన్నీ ఓపెన్‌..!

-

క‌రోనా క‌ట్ట‌డికి మే 3వ తేదీ వ‌ర‌కు విధించిన లాక్‌డౌన్ గ‌డువు ముగుస్తుండ‌డంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మే 4వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న‌ట్లు తెలిపింది. ఆ రాష్ట్రంలోని కంటెయిన్‌మెంట్ జోన్లు త‌ప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా పూర్తి స్థాయిలో కార్య‌క‌లాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమ‌తులు ఇస్తామ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, భారీ, చిన్న‌, మ‌ధ్య త‌రహా సంస్థ‌లు ప‌నిచేసేందుకు అనుమ‌తిస్తామ‌ని తెలియ‌జేసింది.

karnataka to give big relief from corona lock down after may 3rd

ఇక క‌ర్ణాట‌క‌లో ఉన్న ఐటీ సంస్థ‌లు మాత్రం త‌మ ఉద్యోగుల‌ను ఇంటి నుంచే ప‌నిచేయించాల‌ని సూచించింది. మ‌రో 3 నెల‌ల వ‌ర‌కు క‌రోనా ప్ర‌భావం ఉంటుంద‌ని.. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ప‌లు స‌డ‌లింపులు ఉన్న‌ప్ప‌టికీ ప‌లు నియంత్ర‌ణ‌లు కూడా కొన‌సాగుతాయ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. ఈ మేర‌కు సీఎం య‌డ్యూర‌ప్ప వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇక మే 4వ తేదీ నుంచి అన్ని ప‌రిశ్ర‌మ‌లు తిరిగి ప‌నిచేసేందుకు అనుమ‌తినిస్తామ‌ని, మాస్క్‌లు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. మే 4 నుంచి ప‌రిశ్ర‌మ‌ల్లో 50 శాతం సిబ్బందితో ప‌నిచేసేలా ఆదేశాలు జారీ చేస్తామ‌న్నారు.

రాష్ట్రంలో ప్రజా ర‌వాణా పూర్తిగా నిషేధంలో ఉంటుంద‌ని.. ప్రైవేటు వాహ‌నాలకు అనుమ‌తి ఉంటుంద‌ని, కంపెనీలు త‌మ సొంత వాహ‌నాల్లో ఉద్యోగులు, కార్మికుల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించుకోవ‌చ్చ‌ని ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి జ‌గ‌దీష్ షెట్టార్ వెల్ల‌డించారు. అలాగే రాష్ట్రంలో బ‌స్సులు, రైళ్లు తిరిగేందుకు అనుమ‌తించ‌బోమ‌ని తెలిపారు. అలాగే మాల్స్‌, సినిమా హాల్స్ మూసివేసి ఉంటాయ‌న్నారు. సెలూన్లు, బ్యూటీ పార్ల‌ర్లు, మ‌ద్యం షాపులను ఓపెన్ చేయ‌డంపై మే 3వ తేదీ త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

కాగా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే విద్యార్థులు, వ‌ల‌స కూలీల రాక‌పోక‌ల‌ను అనుమ‌తినిస్తామ‌ని క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే సిమెంట్, స్టీల్ షాపులు తెరుచుకుంటాయ‌ని, క్ర‌ష‌ర్స్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు ప‌నిచేస్తాయ‌ని అధికారులు తెలిపారు. కాగా కర్ణాట‌క‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 532 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 20 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news