కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. కరోనా మహమ్మారి ధాటికి వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో లక్షల మందికి కరోనా సోకుతోంది. దీంతో మళ్లీ సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందా..? కరోనా ఎప్పుడు అంతమవుతుందా..? అని జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే విషయంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ప్రముఖ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఏమన్నారంటే…
”ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే జూన్ వరకు మళ్లీ కరోనాకు ముందు ఉన్న సాధారణ స్థితులు నెలకొంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పాటించాల్సింది ఒక్కటే. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలి. ఆసియా దేశాలను పాశ్చాత్య దేశాలు ప్రేరణగా తీసుకోవాలి. కరోనా కట్టడికి కృషి చేయాలి. కరోనా అంతమవుతుంది. ప్రజలు మళ్లీ సాధారణ జీవితం గడుపుతారు.”
కాగా బిల్‌గేట్స్.. అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాను షట్ డౌన్ చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఆసియా దేశాలను ప్రేరణగా తీసుకుని లాక్‌డౌన్ అమలు చేసి ఉంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 4.68 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 16,600కు పైగా కరోనా వల్ల మృతి చెందారు. అలాగే దాదాపుగా 26వేల మంది రికవరీ అయ్యారు.