మీరు నివసిస్తుంది హైదరాబాద్ లోనా… అందులోనూ అసీఫ్ నగర్, బార్కాస్, మణికొండ, జూబ్లీహిల్స్, ఉప్పల్, జియాగూడ, గోల్కొండ, గచ్చిబౌలి, అంబర్పేట్, నాంపల్లి, రెడ్‌హిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉంటున్నారా… మీకు మాంసం తినే అలవాటుందా… ఈ మధ్యకాలంలో మటన్ కొన్నారా? అయితే మీరు తిన్నది కేవలం మేక, గొర్రె మాంసమే కాదు… బీఫ్ కలిసిన మటన్ అంటున్నారు అధికారులు! వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా… ఇది వాస్తవం!
సాధారణంగా… గొర్రె, మేక మాంసంలో బీఫ్ కలిపి అమ్మే దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూనే ఉంటాయి! ఇప్పుడు అలాంటి సంఘటనలకోసం ఆన్ లైన్ లోకి వెళ్లనవసరం లేదు… హైదరాబాద్ లోని మటన్ దుకాణాల్లో మటన్ లాంటి మటన్ కొంటే చాలు! మాంసం అమ్మకాలు, అక్రమాలు, అధిక ధరలపై పరిశీలన కోసం పశుసంవర్ధక శాఖ అధికారులు మూడు రోజులుగా జీ.హెచ్.ఎం.సీ పరిధిలో విసృత తణికీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కఠోర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, అభిరుచితో మాకు పనేలా… మా గళ్లా పెట్టె నిండటమే మాకు ముఖ్యం అనుకున్న కొంతమంది మటన్ వ్యాపారస్తులు ఇలాంటి నీచానికి ఒడిగట్టారంట!
ఈ క్రమంలో సుమారు 62 మాంసం దుకాణాలను అధికారులు తనిఖీ చేయగా… వాటిలో 50 మటన్ దుకాణాలకు లైసెన్సులే లేవని కూడా తేలిందట.. మరికొందరేమో చికెన్ షాపు పేరిట పర్మిషన్ తీసుకుని మటన్ అమ్ముతున్నారట. ఈ తరహా దందా ఇప్పుడేదో కరోనా టైంలో మాత్రమే జరుగుతుందని అనుకుంటే పొరపాటేనట… ఇది ఎప్పటినుంచో జరుగుతున్నట్టు తెలుస్తోందని చెబుతున్నారట అధికారులు!