కరోనా వ్యాక్సిన్ల పై రాజకీయ రగడ

-

భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ రాజకీయ రగడకి తెర తీశారు. తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను పక్కనబెట్టి అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌పై ఫేజ్-3 ట్రయల్స్‌ను నిర్వహించలేదని, ఇటువంటి సమయంలో దీని అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడం ప్రమాదకరమని శశిథరూర్ కొత్త వివాదాన్ని లేవనెత్తడంతో వ్యాక్సిన్ పై రాజకీయరగడ ప్రారంభమైంది.

ఇక పరీక్షలు పూర్తయ్యే వరకు దీని వినియోగాన్ని ఆపేయాలని సలహా ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను డిమాండ్ చేశారు. అంతవరకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్ తో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలన్నారు శశిథరూర్‌. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా కోవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. మరోవైపు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. ఇవి బీజేపీ వ్యాక్సిన్లను తాను నమ్మనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వెనక్కి తగ్గి తాను వ్యాక్సినేషన్‌ కోసం బీజేపీ తీసుకుంటున్న చర్యల్ని మాత్రమే విమర్శించానన్నారు.

శశిథరూర్‌, అఖిలేశ్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ మండిపడ్డారు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్ల గురించి ఇలా మాట్లాడటం తగదని సూచించారు. అటు కోవాగ్జిన్ ను ప్రస్తుతానికి బ్యాక్‌అప్‌గా అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కొద్ది వారాలపాటు సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవీషీల్డ్‌ను పంపిణీ చేస్తారని, అవి ఐదు కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత భారత్ బయోటెక్ ఫేజ్-3 ట్రయల్స్ డేటా అందుబాటులోకి వచ్చాక.. కోవ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

మరోవైపు క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొవ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు జారీ చేసిందన్న ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సీఎండీ డా. కృష్ట ఎల్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే ఈ పాలిటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక మంది భారతీయ కంపెనీలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version