మన శరీరంపై దాడి చేసే అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాల పట్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ రక్షణ కల్పిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రోగ నిరోధక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే.. మనం ఇన్‌ఫెక్షన్లు రాకుండా అంత గట్టిగా ఎదుర్కోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి ఆ శక్తి పెరగాలంటే.. నిత్యం ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు తదితర గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* బాదంపప్పు లాంటి నట్స్‌లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
* ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* కివీ పండ్లను పుష్కలంగా తినడం వల్ల కూడా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వాటిలో ఉండే విటమిన్ సి మనకు మేలు చేస్తుంది. అలాగే బ్లూ బెర్రీలలో ఉండే విటమిన్ సి, ఎ లు కూడా మన శరీరానికి రక్షణ ఇస్తాయి.
* బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ సి, టమాటాల్లో ఉండే విటమిన్ ఇ, బీటా కెరోటీన్, చిలగడదుంపల్లో ఉండే విటమిన్ ఎలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
* వెల్లుల్లి, అల్లం, పసుపు కూడా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే కరోనా వైరస్‌ను ఎంతో కొంత వరకు అడ్డుకునేందుకు మనకు కావల్సిన శక్తి లభిస్తుంది.