ఏమాటకామాట చెప్పుకోవాలి అంటే… కరోనా కట్టడికోసం విధించిన లాక్ డౌన్ లో మిగిలిన అందరి కష్టాలు, మిగిలిన అన్ని కష్టాలు ఒకెత్తు అయితే… మందుబాబుల కష్టాలు, మందుకోసం పడుతున్న కష్టాలు ఇంకొకెత్తు! ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ 1.0 ఏప్రిల్ 14తో ముగుస్తుందని భావించడంతో.. అక్కడితో ఆల్కహాల్ కష్టాలు తీరిపోయాయని అంతా భావించారు. కాని… ఆ ఆనందం కాస్త నేలకారిన బీరులా ఇంకిపోయింది. అది కాస్త లాక్ డౌన్ 2.0 అయ్యి మే 3 వరకూ గొంతులెండేలా చేసింది. ఇక ఇప్పుడు ఆ సమస్య లేదు… లాక్ డౌన్ పూర్తయిన వెంటనే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. కాకపోతే ఈ గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల గ్లాస్ మెట్స్ కి కాదు… కర్నాటక, మహారాష్ట్ర గ్లాస్ మెట్స్ కి!!
అవును… పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మద్యం దుకాణాలను తెరిచేందుకు యడియూరప్ప సర్కార్ సిద్దమైందట. తెరిచిన తర్వాత కూడా ఎప్పటిలాగానే… సామాజిక దూరం పాటించడం మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుందట. అదేముందిలే… రేషన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర ఉండటం లేదా… అని ఆనందపడిపోతున్నారట జనాలు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏమిటంటే…. కరోనా కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో మాత్రమే ఈ కార్యక్రమం పునః ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది.
అలాగే మహారాష్ట్ర సర్కార్ కూడా మే 3 తరువాత మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి నుండి బయటకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా పడిపోవడంతో.. మరో ఆప్షన్ లేక మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తుందట మహారాష్ట్ర సర్కార్! అయితే లాక్ డౌన్ ను కొనసాగిస్తారా.. లేదా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన తర్వాతే దీనిపై ముందుకు వెళ్ళాలని అన్ని రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తుంది!