మరికొద్ది సేపట్లో ఇంకా చెప్పాలంటే ఇవాళ మధ్యాహ్నం మంత్రుల రాజీనామా ప్రక్రియ షురూ కానుంది. అంటే ఇకపై ఇప్పటిదాకా పనిచేసిన వారిలో నలుగురు మినహా మిగతా వాళ్లంతా మాజీలు కానున్నారు అని తేలిపోనుంది. ఆ నలుగురిలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఒకరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు, గుమ్మన జయరాం ఒకరు, ఆదిమూలం సురేశ్ ఒకరు కన్ఫం అయ్యారు అని సమాచారం. మంత్రి సీదిరి ని కూడా రిపీట్ చేస్తారు అని చెబుతున్నారు కానీ అది కూడా సాధ్యం అయ్యేలా లేదు.
ఎందుకంటే ఆయన కూడా జగన్ కు వీర విధేయుడే ! ఎన్నో సార్లు ఆంధ్రా – ఒడిశా సరిహద్దు వివాదాలపై ఓ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కన్నా వేగంగా స్పందించారు. కఠినంగా వ్యవహరించారు.ఆ మాటకు వస్తే పొరుగున ఉన్న ఒడిశాకు చెందిన ఓ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ను వార్న్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన కూడా మాజీ కాబోతున్నారు.
అన్నింటి కన్నా ఆనందం ఏంటంటే బూతుల మంత్రులను తప్పిస్తుండడం. పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీను లాంటి వారందిరిదీ ఇంటి దారే ! ఇక మహిళా మంత్రుల జాబితాలో కొత్తగా విడదల రజనీ రావొచ్చు. ఉషా శ్రీ చరణ్ రావొచ్చు. ఆఖరి నిమిషంలో అదృష్టం బాగుంటే రోజా కూడా రావొచ్చు. వీరితో పాటు మరొక మహిళకు అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక వెళ్లిపోతున్న మంత్రులలో తీవ్ర అసంతృప్తి ఉన్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాసన్న ఒకరు. అదేవిధంగా ఇంకొందరు కూడా ఉన్నారు. జగన్ భజన తాము ఎంత చేసినా కూడా ఆఖరి నిమిషంలో తమను తప్పిస్తామని మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) నుంచి కాల్స్ చేయించడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులలో కాపు సామాజికవర్గంకు చెందిన బొత్స సత్య నారాయణ కానీ అవంతి శ్రీను కానీ చాలా కోపంగా ఉన్నారు అని తెలుస్తోంది. బొత్స మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఓవిధంగా తన రాజకీయ ప్రత్యర్థి కోలగట్లకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలిసి ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇదే కనుక జరిగితే బొత్స లో ఉన్న అసంతృప్తి అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రవాణా శాఖను ఇంతకాలం చూసి, సీఎం చెప్పారని సినిమాటోగ్రఫీ శాఖను భుజాన మోసి, ఓ విధంగా సమాచార శాఖ తరఫున మాట్లాడినా సీఎం తరఫునే మాట్లాడిన విధంగా మాట్లాడిన పేర్ని నాని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తీవ్ర భావోద్వేగంలో కూడా ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి కొడాలి నాని అని అనుకుంటున్నారే కానీ సచివాలయంలో
సీఎం తరఫున మాట ఏదయినా చెప్పాలంటే ఆ పని నిన్నటి దాకా పేర్ని నాని చేశారు.ఇప్పుడది కుదరని పని..అందుకే ఆయన కుదురుకోలేక పోతున్నారు.