మన దేశం ఎన్నో కళలలకు పుట్టినిళ్లు. అలాగే ఎన్నో విచిత్రమైన సంఘటనలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు కూడా నెలవు. వివిధ తండాల్లో ఉన్న వింత ఆచారాల గురించి మీరు వినే ఉంటారు. నమ్మకాల మీద వ్యాపారం చేసే మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వార్త వింటే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సాధారణంగా ఊర్లో శ్మశాన వాటిక అంటే ఎప్పుడో ఒకసారి శవం కాలుతుంది. ఊర్లో రోజూ ఎవ్వరూ చనిపోరు కదా..! కానీ ఆ గ్రామంలో నిత్యం పీనుగు పోవాల్సిందే.. కట్టే కాలాల్సిందే..! అలా జరగకపోతే కచ్చితంగా ఊర్లో ఒకరు చనిపోతారట! వామ్మో చాలా భయంకరంగా ఉంది కదా..! ఆ శ్మశానంలో రోజూ ఏదో ఒక శవం కాలుతూనే ఉంటుంది. బీహార్ రాష్ట్రంలో ఉందీ శ్మశానవాటిక.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బీహార్‌లోని సివాన్‌లో ఒక పురాతనమైన శ్మశానవాటిక ఉంది. దీని వెనుక కొన్నేళ్ల నుంచి అనేక ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజలు భయపడుతుంటారు. గుత్నీ యొక్క గయాస్‌పూర్ శ్మశాన వాటిక కథ ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రతిరోజూ మృతదేహాలు కాలిపోతూనే ఉంటాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేయని రోజున గ్రామానికి చెందిన ఎవరైన ఒకరు చనిపోతుంటారు. ఇలా గతంలో అనేక సార్లు జరిగాయని గ్రామస్థులు బలంగా చెప్తున్నారు. ఈ గ్రామ ప్రజలు దీనిని ప్రమాదకరమైన, గగుర్పాటు కలిగించే శ్మశాన వాటికగా భావించడానికి ఇదే ప్రధాన కారణం.
గయాస్పూర్ శ్మశాన వాటిక సరయు, ఛోటీ గండక్ నదుల సంగమం ఒడ్డున ఉంది. సివాన్ ప్రజలు ఈ ప్రదేశాన్ని మోక్షాన్ని పొందేందుకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రోజూ గరిష్టంగా 10 కనిష్టంగా 1 లేదా 2 మృతదేహాలు అక్కడ కాలిపోవడానికి ఇదే కారణం. అక్కడ గుత్తినే కాదు, రెండు డజన్లకు పైగా గ్రామాల ప్రజలు దహన సంస్కారాలకు వస్తుంటారు. దీని వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది..
గయాస్‌పూర్ శ్మశాన వాటిక శాపగ్రస్తమని స్థానికులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం, ఒక సాధువు బావిలో పడి మరణించాడు. మునిగిపోతున్న సమయంలో, సాధువు అతన్ని రక్షించమని అరుస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ ఆ గ్రామంలోని ప్రజలు భయంతో అతన్ని రక్షించడానికి వెళ్ళలేదట.
దీని తరువాత, చనిపోయే ముందు సాధువు శ్మశానవాటికను ప్రతి రోజు ఎవరో ఒకరి మృతదేహాన్ని ఇక్కడ కాల్చివేస్తారని శపించాడు. అప్పటి నుండి ఇక్కడ ప్రతిరోజూ ఒక చితి వెలిగిస్తారు. మృతదేహం ఎక్కడి నుంచి రాని రోజు.. ఆ గ్రామంలోనే ఒక వ్యక్తి మరణిస్తారని కథలుగా చెప్పుకుంటుంటారు.