దోంగ ఓట్లు… ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచు వినిపిస్తున్న మాట ఇది. దొంగ ఓట్లతోనే ఫలానా నేత గెలిచాడని… ఆ నియోజకవర్గంలో అసలు ఎన్ని అడ్రెస్ లేని ఓట్లు ఉన్నాయో చూడాలని అధికార,ప్రజపక్షాల నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయం దొంగ ఓట్ల చుట్టూనే తిరుగుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో బయటి ప్రాంతాల నుంచి జనాల్ని తీసుకువచ్చి వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుందని టీడీపీ ఆరోపించింది.కొంతమంది అపరిచితుల్ని కూడా పట్టుకుని ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు వైసీపీపై ఫిర్యాదు చేశారు.అలాగే బద్వేలు అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికలోను ఇదే ఆరోపణ చేసింది టీడీపీ.
అయితే ఇప్పుడు అదే దొంగ ఓట్ల రాగాన్ని అధికార వైసీపీ నేతలు అందుకున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ ఈసారి అన్ని స్థానాలను గెలుచుకుంటామని అంటోంది. అన్ని నియజకవర్గాల్లో టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయించిందని చెప్తున్న వైసీపీ…. ఆ అడ్రెస్ లేని ఓట్లను తొలగిస్తే సులభంగా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తపరుస్తున్నారు. అటు కుప్పంలో కూడా వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబుపై ఎమ్మెల్సీ భరత్ కచ్చితంగా గెలుస్తారని మంత్రి అంటున్నారు. రెండురోజుల క్రితం కుప్పం మునిసిపాలిటీ లో పర్యటించిన సందర్బంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పర్యటిస్తుంటే పెద్ద ఎత్తున జనం సమస్యలు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని కుప్పం ప్రజలు పసిగట్టారని వ్యాఖ్యానించారు
కుప్పం ఎమ్మెల్యేగా భరత్, చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో దొంగ ఓట్లు చూసిన తర్వాత రాష్ట్రంలో దొంగ ఓట్లపై దృష్టి సారించామన్నారు మంత్రి. చంద్రబాబు అధికారంలో ఉండగా నమోదైన 60 లక్షల దొంగ ఓట్లపై ఎమ్మెల్యేలను, ఎంపీలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఈ మేరకు దొంగ ఓట్లను గుర్తించే పనిలో ఉన్నామని, ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. 2019 ఎన్నికలకు ముందే ఈ తంతు జరిగిందన్నారు. కుప్పంలో ఇప్పటి వరకు 17 వేల ఓట్లు గుర్తించామని, మరో 25 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఇవన్నీ తొలగిస్తే చంద్రబాబు ఓటమి ఖాయమని ప్రకటించారు.