కెన్యా అడవిలో ‘‘జాంకీ’’ పుట్టింది..!

-

అమ్మ పక్కన చెంగుచెంగున గంతులు వేస్తున్న ఆ బుజ్జిముండను చూసి నెటిజెన్లు మురిసిపోతున్నారు.

కెన్యా అడవిలో ఒక ‘‘అత్యంత అసాధారణ’’ విచిత్రం చోటు చేసుకుంది. జీబ్రాకు, గాడిదకు ఓ పిల్ల పుట్టింది. ప్రపంచంలో ఈ తరహా జీవి అత్యంత అరుదు. జీబ్రాకు, డాంకీకి పుట్టిన ఈ బుజ్జిముండను ‘‘జాంకీ’’గా పిలుస్తున్నారు.

రెండు రోజుల క్రితం, కెన్యాలో వన్యప్రాణుల రక్షణ-పునరావాస సంస్థ, షెల్‌డ్రిక్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ వాళ్లు తాము చూసిన ఈ వింతను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసారు. తల్లి జీబ్రా పక్కన గెంతుతున్న చిన్నారి జాంకీని చూసినట్లు వారు తెలిపారు.

గత ఏడాది మేలో త్సావో జాతీయ పార్కు నుంచి తప్పించుకుని స్థానిక మహిళ పశువుల మందలో చేరింది. ఇది జరిగిన కొన్నిరోజులకు ఆ మహిళ  ఈ ట్రస్టును పిలిచి దానికి పునరావాసం కల్సించాల్సిందిగా కోరింది. దాంతో ట్రస్టు సభ్యులు ఈ జీబ్రాను చైలూ జాతీయ పార్కుకు తరలించారు. అది అక్కడి పరిస్థితులకు త్వరగానే అలవాటు పడి జీవనం కొనసాగిస్తోంది.

 

కొన్ని రోజుల తర్వాత ఆ పార్కు కంచె సరిచేసే సిబ్బంది, ఈ జీబ్రా పక్కన ఒక పిల్లను చూసాడు. మరికొన్ని వారాల తర్వాతనే ఆ పిల్ల విభిన్నమైన రంగులతో, కాళ్ల వరకే ఉన్న చారలతో ఉన్న విషయం తెలిసింది. ముందుగా దాన్ని బురదలో పొర్లాడిన జీబ్రా పిల్లగా భ్రమపడ్డారట వాళ్లు. కానీ ఆ తర్వాత అర్థమయింది వాళ్లకి అది ఆ జీబ్రాకు, ఒక గాడిదకు పుట్టిన పిల్ల అని. జీబ్రాకు, గాడిదకు కలిపి సంతానం కలగడమనేది అత్యంత అసాధారణ విషయమనీ, బహుశా ఆ జీబ్రా మహిళ తాలూకు పశువుల మందలో ఉన్నప్పుడే గాడిదను కలిసిఉంటుదని షెల్‌డ్రిక్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ అనుమానం వ్యక్తం చేసింది.

ఏదేమైనా, పుట్టిన ఈ పిల్ల కూడా చాలా అందంగా ఉందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నందుకు మనం సంతోషించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news