ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కోడిగుడ్లు అయితే కొన్ని రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ తరువాత పాడవుతాయి. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం 1000 ఏళ్ల కిందటి కోడిగుడ్డును తవ్వకాల్లో గుర్తించారు. ఆ గుడ్డు ఇప్పటికీ పాడవ్వకుండా అలాగే ఉందని తెలిపారు. అన్ని ఏళ్ల పాటు ఉన్నా ఆ గుడ్డు ఎందుకు పాడవలేదు ? అనే విషయంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్‌లోని యవ్నె అనే ప్రాంతంలో అక్కడి యాంటీక్విటీస్ అథారిటీ అధికారులు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలోనే అత్యంత పురాతనమైన వ్యర్థ పదార్థాలను వేసే గుంత ఒకటి బయట పడింది. అందులో మానవ మలంతో కప్పబడి ఉన్న ఓ కోడిగుడ్డును గుర్తించారు. అది సుమారుగా 1000 ఏళ్ల కిందటిదని నిర్దారించారు.
మానవ మలంతో కప్పబడి ఉన్నందు వల్లే ఆ గుడ్డు ఇంకా అలాగే ఉందని సైంటిస్టులు తెలిపారు. అందుకే ఆ గుడ్డు పాడవలేదన్నారు. ఇక ఆ గుడ్డుతోపాటు మనిషి ఎముకలతో తయారు చేసిన బొమ్మలను కూడా గుర్తించారు. అవి కూడా 1000 ఏళ్ల కిందటివని తేల్చారు. అయితే ఆ గుడ్డు నుంచి కొద్దిగా తెల్లసొన లీకైందని, కానీ పచ్చ సొన అలాగే ఉందని, ఆ గుడ్డు ఇంకా పాడవలేదని తెలిపారు. ఈ క్రమంలో ఆ గుడ్డు డీఎన్ఏపై మరిన్ని పరిశోధనలు చేస్తామని వారు తెలిపారు.